
జోరు వానతో రోడ్డుపైకి చేరిన వరద నీటిలో కష్టంగా వెళుతున్న వాహనదారులు
సాక్షి, హైదరాబాద్ : మహానగరం మహా సంద్రాన్ని తలపిస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరవాసుల జీవనం అస్థవ్యస్తమైంది. మధ్యాహ్నం నుంచే ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండటం తీవ్రం ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ భారీ వర్షాలతో బాలపూర్ రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్ వేళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివాజీ చౌక్, సాయినగర్ నుంచి ఎయిర్‌పోర్ట్ వెళ్ళే ప్రధాన రహదారి వర్షం నీటితో నిండి చెరువును తలపిస్తోంది.
భారీ వర్షానికి నాగోల్ ఆదర్శ్ రోడ్లు నీట మునిగాయి. చాలా కాలనీ రోడ్లు నదిని తలపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు కొన్ని రోడ్లను బంద్ చేస్తున్నారు. కర్మన్ ఘాట్ ప్రధాన రహదారికిపైకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ చిక్కుకొని నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
భాగ్యనగరాన్ని వర్షం వదలడం లేదు. ఆదివారం వరుణుడు మరోసారి హైదరాబాద్ వాసులపై దాదాపు దాడి చేసినంత పనిచేశాడు. ఇప్పటికే భారీ వర్షం కురుస్తుండటంలో నగర ప్రజలు ఆందోళన చెందుతుండగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, బేగంపేటతోపాటు పలు ప్రాంతాల్లో వాన నీటితో నిండిపోయాయి. ముషీరబాగ్, నారాయణగుడా, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. బస్తీల్లోకి వరదనీరు భారీగా వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షం దెబ్బ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వచ్చి పడ్డ వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతినడంతో.. వాటిని పునరుద్ధరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. నీట మునిగిన కాలనీలను పరిశీలిస్తూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆక్రమణకు గురైన నాలాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment