బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటే! | Ghulam Nabi Azad Said BJP And TRS Same In MP Elections | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటే!

Published Mon, Apr 8 2019 2:28 PM | Last Updated on Mon, Apr 8 2019 2:29 PM

Ghulam Nabi Azad Said BJP And TRS Same In MP Elections - Sakshi

మధుయాష్కిని గెలిపించాలని కోరుతున్న కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌

నిజామాబాద్‌నాగారం: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఇంకా మభ్యపెడుతున్నాయని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ అనుభవిస్తూ, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆజాద్‌ ప్రసంగించారు.

తెలంగాణ ఇచ్చింది ఒకరైతే, అనుభవించేది మరొకరని కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని, నోట్ల రద్దు, జీఎస్టీకి టీఆర్‌ఎస్‌ మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేసినా కేసీఆర్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేదని తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటుపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ మాయమాటలు చెబుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని చెప్పారు. రాహుల్‌గాంధీ తీసుకొచ్చిన కనీస ఆదాయ పథకం పేదల బతుకుల్లో వెలుగులు నింపుతుందన్నారు. మధుయాష్కిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో నియంత పాలన: షబ్బీర్‌
కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ విమర్శించారు. అసదుద్దీన్‌ ఓవైసీతో కలిసి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పేద ముస్లింలను ఓవైసీ ఏనాడూ పట్టించుకోలేదని, వారి ఓట్లతో గెలిచి వారి సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత కేవలం హామీల కవితలకే పరిమితమైంది తప్ప నెరవేర్చలేదని.. పసుపుబోర్డు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేయకపోవడంతోనే ఎంపీ కవితపై రైతులు పోటీలకు దిగారని గుర్తుంచుకోవాలన్నారు. 

హామీలు నెరవేర్చలేదు: గద్దర్‌ 
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జీఎస్టీతో పాటు కేఎస్టీ అమలవుతోందని గద్దర్‌ ఆరోపించారు. ఏ పని చేపట్టినా కేఎస్టీ చెల్లిస్తేనే వాటి పనులు జరుగుతాయని, లేకుంటే ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, వక్ఫ్‌బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రజలకు అండగా ఉంటుందన్నారు.  

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి: మధుయాష్కి
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నిజామాబాద్‌ అభ్యర్థి మధుయాష్కి తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాకు అలీసాగర్, గుత్ప పథకాలతో పాటు పాస్‌పోర్టు కార్యాలయం, మెడికల్‌ కళాశాల తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఈ సారి గెలిపిస్తే సదా మీ సేవలో ఉంటానన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, డీసీసీ చీఫ్‌ మానాల మోహన్‌రెడ్డి, నేతలు మహేష్‌కుమార్‌గౌడ్, కేశ వేణు, తాహెర్‌బిన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement