
శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య అధ్యాపకులు (ప్రొఫెసర్ల) ఉద్యోగ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల కొరత తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ విరమణ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మహబూబ్‌నగర్, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కొత్తగా 3 వేల పడకలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన ఫైలుపై సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం.
ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ ఆసుపత్రులు
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై శుక్రవారం హైదరాబాద్‌లోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈటల సమీక్షించారు. గిరిజన ప్రాంతాలకు చెందిన జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ వంటి వ్యాధులతో పాటు, విష జ్వరాలను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ‘వర్షాకాలంలో ప్రబలుతున్న విష జ్వరాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనే 50 నుంచి 60 శాతం కేసులు నమోదవుతున్నాయి. గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ 10 జిల్లాల్లోని 1,697 గ్రామాలను హై రిస్క్‌గా గుర్తించాం. ఈ గ్రామాల్లో 6,52,314 మంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ ఆస్పత్రులు అందుబాటులో ఉంచండి’అని సూచించారు. ఈ ప్రాంతాల్లో దోమల నివారణకు జూన్ నుంచి ఆగస్టు వరకు రెండు సార్లు దోమల నివారణ మందు పిచికారీ చేయాలని చెప్పారు. హైరిస్క్ గ్రామాల్లో 7.18 లక్షల బెడ్ నెట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక దశలోనే దోమ లార్వాలను నాశనం చేయాలని, ఇళ్లలో దోమల నివారణ మందులు పిచికారీ చేయాలని సూచించారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపి, క్షేత్ర స్థాయి పరిస్థితులపై ప్రతివారం సమీక్షించి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
అందరికీ వర్తింప చేయాలి: డాక్టర్స్ అసోసియేషన్
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులతో పాటు, ఇతర ప్రభుత్వ వైద్యులకూ ఉద్యోగ విరమణ వయసు పెంచాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పుట్ల శ్రీనివాస్, వి.రవిశంకర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య విధాన పరిషత్‌తో పాటు, ఈఎస్‌ఐ, ప్రజారోగ్య శాఖలోనూ అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ అనే వివక్ష లేకుండా అందరికీ ఉద్యోగ విరమణ వయసు పెంచాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
నిరవధిక సమ్మెకు దిగుతాం: జూనియర్ డాక్టర్స్ జేఏసీ
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగ యువ వైద్యులకు తీరని అన్యాయం చేస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ జేఏసీ ప్రకటించింది. పదేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అవకాశం ఉండదనే ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. మెడికల్ కాలేజీలు, సీట్ల పెంపు నేపథ్యంలో ఉద్యోగ విరమణ పెంపు ద్వారా సమస్య పరిష్కారమవుతుందనే అపోహను ప్రభుత్వం వీడాలని జేఏసీ హితవు పలికింది. ఉద్యోగ విరమణ పెంపుదల జీవో ఉపసంహరించుకోకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment