
సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుకుంటున్న వారి మంచిచెడ్డలపై వైద్యశాఖ ఆరా తీయనుంది. అలాగే, స్కూల్ హెల్త్ యాప్‌ను వైద్యశాఖ రూపొందించింది. మరోవైపు.. సచివాలయాల ఏఎన్‌ఎంలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులను స్క్రీనింగ్ చేసి వారి ఆరోగ్య వివరాలను యాప్‌లో నమోదుచేస్తారు. ఈ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడతారు. స్కూల్ హెల్త్ డ్రైవ్ పేరుతో 15 రోజులపాటు దీనిని నిర్వహిస్తారు.
రక్తహీనతపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా 45వేల ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 47 లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్నారు. వీరందరికీ ఏఎన్‌ఎంలు స్క్రీనింగ్ చేయనున్నారు. స్క్రీనింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఏఎన్‌ఎంలకు శిక్షణ పూర్తయింది. స్క్రీనింగ్‌లో భాగంగా విద్యార్థుల ఎత్తు, బరువు, బాడీమాస్ ఇండెక్స్ వివరాలు సేకరించడంతో పాటు, రక్తహీనత గుర్తించేందుకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేపడతారు.
ఈ వివరాలన్నింటినీ యాప్‌లో నమోదుచేస్తారు. రక్తహీనత సమస్యలున్న విద్యార్థులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పిల్లల్లో ఈ సమస్యను అధిగమించడం కోసం వారానికి ఒకసారి పాఠశాలలకు ఐరన్ ఫోలిక్ మాత్రలను వైద్యశాఖ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం చేపడుతున్న స్క్రీనింగ్‌లో రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తిస్తే వారిపై మరింత శ్రద్ధ పెట్టేందుకు వీలుంటుంది.
పాఠశాల పరిసరాల వివరాలు కూడా..
విద్యార్థుల ఆరోగ్య వివరాలతో పాటు పాఠశాలల్లో పరిసరాలు–పరిశుభ్రత, ఇతర వివరాలను యాప్‌లో నమోదుచేస్తారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ అనుసరిస్తున్నారా, పరిశుభ్రతలో భాగంగా ఆవరణలో నీరు నిలిచి ఉంటోందా.. దోమల వృద్ధికి ఆస్కారం ఉండేలా నీరు నిలిచి ఉండటం, చెత్తకుప్పలు ఉంటున్నాయా తదితర వివరాలతోపాటు నీటి నాణ్యతను పరిశీలిస్తారు.
అదే విధంగా బాలికలకు శానిటరీ నాప్‌కిన్‌లు అందిస్తున్నారా లేదా, వాటి నాణ్యత, ఐఎఫ్‌ఏ మాత్రల పంపిణీ, తదితర వివరాలన్నింటినీ సేకరించి యాప్‌లో నమోదుచేస్తారు. నమోదు చేసిన వివరాల ఆధారంగా ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారానికి విద్యా, మున్సిపల్, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖలను ఈ కార్యక్రమంతో సమన్వయం చేస్తారు.
సమస్యలపై ఆయా శాఖలకు సందేశాలు
ప్రతి ఏఎన్‌ఎం తన పరిధిలోని పాఠశాలలను సందర్శిస్తారు. పిల్లలను స్క్రీనింగ్ చేసి, పాఠశాలలో ఇతర వసతులను పరిశీలించి వివరాలు నమోదుచేస్తారు. ఒకవేళ ఆవరణలో చెత్తకుప్పలు, నీటి నిల్వలు ఉంటే ఫొటోతో సహా ఆ సమస్యను యాప్‌లో నమోదుచేస్తారు. రూరల్ అయితే పంచాయతీరాజ్‌కు, అర్బన్‌లో మున్సిపల్ విభాగాలను మెసేజ్ రూపంలో ఆ యాప్ అప్రమత్తం చేస్తుంది. వారు అవసరమైన చర్యలు తీసుకుంటారు. రక్తహీనతతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలుంటే వైద్యశాఖ చర్యలు చేపడుతుంది.
– డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, ప్రజారోగ్య సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment