
ఏ దేవుడు కరుణించాడో బతికిపోయా!
ఎదురుగా పది అడుగుల దూరంలో సింహం. కదలకుండా బొమ్మలా కూర్చుండి పోయాడు.. గంటసేపు సేపు ఊపిరి బిగబట్టి ఓ రైతు ప్రాణాలు రక్షించుకున్నాడు.
కెరమెరి: ఎదురుగా పది అడుగుల దూరంలో సింహం. కదలకుండా బొమ్మలా కూర్చుండి పోయాడు.. గంటసేపు సేపు ఊపిరి బిగబట్టి ఓ రైతు ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం చిన్నగూడలో బుధవారం చోటు చేసుకుంది. కేస్లాగూడ(ఏ) గ్రామానికి చెందిన సిడాం భీంరావు చిన్నగూడ శివారులోని తన పొలంలో బుధవారం ఉదయం ఎడ్లను మేపుతూ గట్టుపై కూర్చున్నాడు. ఒక్కసారిగా అక్కడకొచ్చిన సింహం గాండ్రిం చింది. పది అడుగుల దూరం నుంచి గుర్రుగా చూస్తూ నిలబడిపోయింది. సింహం దగ్గరికి వచ్చేసరికి ఆ రైతు చచ్చేంత భయపడిపోయాడు.
అయినా కదలకుండా.. మెదలకుండా అలాగే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత సింహం వెనక్కి వెళ్లింది. దీంతో రైతు భీంరావు వెంటనే మైదాన ప్రాంతంలోకి వచ్చాడు. రైతును గమనించిన సింహం మళ్లీ అతడి వద్దకు వచ్చింది. మళ్లీ భీంరావు కదలకుండా ఉండడంతో చుట్టూ తిరిగింది. ఇంతలోనే అటువైపుగా ఓ మేకల మంద రావడంతో సింహం వాటిపైకి లంఘించి ఓ మేకను నోట పట్టుకుని పరుగెత్తింది. భీంరావు గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్తులు వచ్చి వెతికారు. ‘సింహం ఎదురుపడగానే, ఇదే నా చివరి రోజని భగవంతునితోపాటు ఇంటి వాళ్లందరినీ స్మరించుకున్నా.
ఏ దేవుడు కరుణించాడో బతికి బయటపడ్డా..’ అని భీంరావు తెలిపాడు. ‘‘నా కళ్ల ముందే మేక పిల్లను సింహం నోట్లో పట్టుకుని వెళ్లింది. ఇటువైపు రావాలంటేనే భయమేస్తోంది.’’ అంటూ జుగాదిరావు అనే రైతు తెలిపాడు.