సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల అమలులో రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు, వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 35 వరకు కాల్స్ వస్తున్నాయని, ఈ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన వారం రోజుల్లో 252 కాల్స్ వచ్చాయని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో తమకు ఆహార పదార్థాలు కావాలని, శానిటైజర్లు కావాలని ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని కంట్రోల్ రూం సభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ కంట్రోల్ రూంను టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జి.వినోద్‌రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూం నిర్వహణపై వినోద్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రజలు తమకు చెబుతోన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, కొన్నింటిని తామే పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీనికి స్థానిక కాంగ్రెస్ నేతల సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment