కేసీఆర్‌ కిట్‌.. బడుగుల్లో హిట్‌ | Good Response To KCR Kit In Poor People | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కిట్‌.. బడుగుల్లో హిట్‌

Published Mon, Oct 1 2018 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 1:59 AM

Good Response To KCR Kit In Poor People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అనేక వైద్య, ఆరోగ్య పథకాలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చేరువయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల హైదరాబాద్‌ వచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ కమిటీకి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం... 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ తో ఇప్పటి వరకు 29.8% మంది ఎస్సీ, ఎస్టీలు లబ్ధి పొందారని తెలిపింది. ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచడం, తల్లీబిడ్డల మరణాలను తగ్గించడం కోసం దీన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు 10.60 లక్షల మంది ఉపయోగించుకున్నారు. వీరిలో ఎస్సీలు 1.99 లక్షల మంది, ఎస్టీలు 1.17 లక్షల మంది. దీనికిగాను ప్రభుత్వం 392.61 కోట్లు వెచ్చించగా, వారికోసం 31 శాతం నిధులను ఖర్చు చేశారు. తెలంగాణలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉపయోగించుకున్నది కేసీఆర్‌ కిట్టేనని కేంద్రానికి తెలిపింది. 

కంటి వెలుగుకు ఆదరణ  
అంధత్వంలేని తెలంగాణగా మార్చేందుకు ఆగస్టులో ప్రారంభమైన కంటి వెలుగు పథ కాన్ని 40 లక్షల మంది ఉపయోగించుకుంటే, అందులో ఎస్సీ, ఎస్టీలే 27.45% మంది ఉన్నారు. దీనిలో ఎస్సీలు 7.04 లక్షలు, ఎస్టీలు 3.94 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కంటి వైద్యశిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్‌ చేసి అద్దాలు ఇస్తారు. అవసరమైతే శస్త్రచికిత్సకు సిఫారసు చేస్తారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో పూర్తిగా కంటి పరీక్షలు నిర్వహించాలనేది ఈ పథకం లక్ష్యం.కంటి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 827 బృందాలను ఏర్పాటు చేశారు.  

ఆరోగ్యశ్రీలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 21.3 శాతం  
ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో 2015–16 నుంచి ఇప్పటి వరకు ఎస్సీలు 14.41 శాతం, ఎస్టీలు 6.89 శాతం ఉపయోగించుకున్నారు. మొత్తంగా 21.3 శాతం ఈ వర్గాల ప్రజలు ఉపయోగించుకున్నట్లు నివేదికలో ప్రస్తావించింది. ఈ పథకం కింద 949 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. 2015–16లో 2.60 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో 14.35 శాతం మంది ఎస్సీలు, 6.76 శాతం మంది ఎస్టీలున్నారు. 2016–17లో మొత్తం 2.76 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే అందులో ఎస్సీలు 14.30 శాతం, ఎస్టీలు 6.90 శాతం ఉన్నారు. ఇక 2017–18లో 3.11 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఎస్సీలు 14.59 శాతం, ఎస్టీలు 7.01 శాతం ఉన్నారు. పిల్లల్లో వచ్చే వ్యాధులను గుర్తించే రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో 2016–18 మధ్య 36.55 లక్షల మంది కవర్‌ కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలు 24.3 శాతం ఉపయోగించుకున్నారు.  

కేసీఆర్‌ కిట్‌ కింద ఎస్సీ, ఎస్టీలు పొందిన లబ్ధి 
–––––––––––––––––––––––––––––––––––– 
ఏడాది        మొత్తం    ఎస్సీలు    శాతం        ఎస్టీలు        శాతం 

2017–18    7,75,168    1,45,286    18.7        86,264    11.1 
2018–19     2,84,898    54,474    19.1    30,996    10.8 

మొత్తం        10,60,066    1,99,760    18.8        1,17,260    11.0 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement