సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల ధరలు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. సూపర్ మార్కెట్లు వినియోగదారులను దోచేస్తున్నాయి. జనవరి నెలతో పోల్చితే ఏప్రిల్ చివరి వారం నాటికి ప్రజలు నిత్యం ఉపయోగించే పప్పులు, వంట దినుసుల ధరలు బాగా పెరిగాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం విస్మయానికి గురిచేస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రతి వస్తువును సాధారణ ధర కంటే సుమారు 20 నుంచి 30 శాతానికి పైగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో హోల్ సేల్ నుంచి రిటైల్ కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ధరలు అమాంతం పెరిగిపోయాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలకు, కార్మికులకు ఎలాంటి ఆదాయమూ లేకపోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. కొద్దో గొప్పో కొనుక్కోగలిగే స్థోమత ఉన్న మధ్య తరగతి ప్రజలు కూడా ధరాఘాతానికి వెనక్కి తగ్గక తప్పడం లేదు. బియ్యంతోపాటు వివిధ పప్పు దినుసులరేట్లకు అదుపు లేకుండా పోయింది. ఏకంగా ఉప్మా రవ్వ కిలో ధర రూ.45 నుంచి 55 పలుకుతుండగా కిలో చింతపండు ధర రూ.260లకు ఎగబాకింది. పెసర పప్పు కిలో ధర రూ.141కు పెరిగింది. హెచ్‌ఎంటీ రకం బియ్యం కిలో రూ.55 నుంచి 65 వరకు పలుకుతుండగా. మసూరి బియ్యం ధర కిలో 56 నుంచి 59, కర్నూలు రైస్ రూ 49 నుంచి 58 వరకు పలుకుతున్నాయి.
కిరాణా షాపులకు బంద్
హైదరాబాద్‌లో ప్రధాన హోల్ సేల్ మార్కెట్లయిన బేగంబజార్, మలక్‌పేట్ మార్కెట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ కిరాణా షాపులకు సరఫరాను నిలిపి వేశారు. దీంతో సూపర్ మార్కెట్లకు డిమాండ్ పెరిగింది. గిరాకీని క్యాష్ చేసుకునేందుకు ఇక్కడ రేట్లు పెంచేశారు. అయినా అడిగే నాథుడు లేడు. మహానగరంలో గుజరాతీ, మార్వాడీలకు సంబధించిన కిరాణా దుకాణాలు కొన్ని మూతపడటంతో సూపర్ మార్కెట్లకు మరింత కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు సృష్టిస్తున్న కొరతతో ఒకవైపు ఎగబాకిన ధరలు, మరోవైపు కరోనా భయంతో కొందరు గుజరాతీ, మార్వాడీలు దుకాణాలు మూసివేసి ఫోన్ ఆర్డర్ల పైనే తమ ఖాతాదారులకు సరుకులు డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు సూపర్ మార్కెట్స్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. రోజువారి నిత్యావసరాలైన గోధుమ పిండి, ఇడ్లీ..ఉప్మా రవ్వలు, టీ, కాఫీ పొడి, చక్కెర, పసుపు, నూనె, పప్పులు, సబ్బులు, హ్యాండ్‌వాష్ తదితర వాటికి డిమాండ్ బాగా పెరిగింది.
ధరల నియంత్రణేది..?
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టినా...ధరలు అదుపులోకి మాత్రం రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్ సీఆర్వో ఆఫీస్‌లో ప్రత్యేక ల్యాండ్‌లైన్ ఏర్పాటు చేసి అధిక ధరలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయినా ఫలితం కన్పించడం లేదు. మరోవైపు తూనికలు..కొలతల శాఖ దాడులకు దిగి «కేసులు నమోదు చేస్తున్నా..ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు.
అధిక ధరలపై ఫిర్యాదు చేయండి...
హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీస్: 040–23447770
తూనికల, కొలుతల శాఖ ఎమ్మార్పీ, తూకం మోసాలపై: 7330774444
టోల్ ఫ్రీ నెంబర్: 1800–42500333
Comments
Please login to add a commentAdd a comment