అంతా గవర్నర్ చూసుకుంటారు...
హైదరాబాద్: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా చంద్రబాబు, స్టీఫెన్సన్ ల ఆడియో రికార్డులు మరింత అగ్గిని రాజేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం గవర్నర్ నరసింహన్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న తాజా పరిణామాలు రెండు రాష్ట్రాలకు మంచివి కాదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఈ ఆడియో టేపుల వ్యవహారంపై తాను ఇప్పడేమీ మాట్లాడలేన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ చూసుకుంటారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు వ్యవహారంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియో టేపులు బహిర్గతమై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి-స్టీఫెన్ వీడియో రేపిన ప్రకంపనలతో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎసీబీ అదుపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎపీ సీంఎంకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగానే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ .. సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ కోసం ఇవాళో రేపో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.