సొమ్మొకరిది.. సోకొకరిది! | Government custom milling Miller | Sakshi
Sakshi News home page

సొమ్మొకరిది.. సోకొకరిది!

Published Sun, Jun 29 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

సొమ్మొకరిది.. సోకొకరిది!

సొమ్మొకరిది.. సోకొకరిది!


మిర్యాలగూడ : సొమ్మొకరిది..సోకొకరిది అన్న చందంగా ఉంది జిల్లాలోని మిల్లర్ల తీరు. ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం లేదు. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఓ పక్క బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లర్లు బియ్యం వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.
 
 తిరిగి రాబట్టుకోవడంలో విఫలం..
 రైతులనుంచి సివిల్ సప్లయీస్ కేంద్రాలతోపాటు ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇస్తున్నా అధికారులు సకాలంలో రాబట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయటి మార్కెట్‌లో విక్రయించుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. 2012-13కు సంబంధించి 8830 టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. 2012-13వ సంవత్సరంలో మిల్లర్ల నుంచి 30,952 టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉండగా 22,122 టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు.
 
 ఇంకా 8,830 టన్నులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది మాట ఇలా ఉంటే ఈ ఏడాది 2013-14లో రబీలో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఒక్క క్వింటాకు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. రబీ సీజన్‌లో రైతులనుంచి 3,67,466 టన్నుల ధాన్యం సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం 220మంది మిల్లర్లకు ఇచ్చారు. కాగా మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి 2,49,876 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క క్వింటా బియ్యం కూడా ఇవ్వలేదు. సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తిస్థాయిలో కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.
 
 మిల్లర్ల వ్యాపారం..
 ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో మిల్లర్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఖరీఫ్ పచ్చిబియ్యం మిల్లర్ల వద్ద 8830 టన్నులు ఉంచుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మిల్లర్లు ఎఫ్‌సీఐకి లేవీ ద్వారా ఇచ్చే బియ్యానికి క్వింటాకు 2100 రూపాయలు చెల్లిస్తారు. అదే లెక్కన మిల్లర్ల వద్ద ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.18.54 కోట్లు ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో కిలోబియ్యం రూ.40 చొప్పున విక్రయిస్తున్నారని అనుకుంటే రూ.35.32 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నట్టే. అంతేకాకుండా రబీలో ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ ఒక్క క్వింటాకు కూడా ఇవ్వలేదు. రబీలో ఉన్న బియ్యాన్ని లెవీకి ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
 
 సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం : నాగేశ్వర్‌రావు, డీఎస్‌ఓ, నల్లగొండ
 మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా సేకరిస్తాం. ఖరీఫ్ సీజన్‌లో ఉన్న బియ్యాన్ని వెంటనే ఇవ్వాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చాం. గడువులోగా కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించడానికి చర్యలు తీసుకుంటాం.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement