
' ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని సర్కార్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆరోపించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై శుక్రవారం శాసనమండలిలో ఆయన అడిగిన ప్రశ్న.. కాసేపు గందరగోళానికి గురిచేసింది. ఓవైపు ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక మాఫియా రాజ్యమేలుతుంటే.. మరోవైపు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీ ఇంటికే ఇసుక వస్తుందని ప్రభుత్వం చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్‌లు స్థానికంగా టీఆర్‌ఎస్ నేతలకు ఉపాధి హామీ పథకంగా మారాయన్నారు. హరీశ్‌రావు స్పందిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అక్రమాలను కూడా అరికడతామని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.
టీచర్ల‘పంచాయితీ’ని పరిశీలిస్తాం: మంత్రి కేటీఆర్
స్థానిక సంస్థల అజమాయిషీలో ఉన్న పాఠశాల విద్యను విద్యాశాఖ పరిధిలోకి తేవాలనే ఉపాధ్యాయుల డిమాండ్‌ను పరిశీలిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక, మాధ్యమిక విద్య గ్రామ పంచాయతీలకు అప్పగించారని, అయితే.. వాటి నియంత్రణ మాత్రమే విద్యాశాఖ పరిధిలో ఉందన్నారు. పంచాయతీరాజ్ విభాగాలను బలోపేతం చేయడంతోపాటు టీచర్ల సమస్యను పరిష్కరించేందుకు త్వరలో విద్యాశాఖ మంత్రి, అధికారులతో చర్చిస్తామన్నారు.