గోదావరి వరదకు అడ్డుకట్ట!  | Government Plans To Evacuate Godavari Water To Southern Telangana | Sakshi
Sakshi News home page

గోదావరి వరదకు అడ్డుకట్ట! 

Published Wed, Jun 26 2019 3:26 AM | Last Updated on Wed, Jun 26 2019 2:03 PM

Government Plans To Evacuate Godavari Water To Southern Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరందించే బృహత్తర ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నికర జలాల కేటాయింపులకు అనుగుణంగా ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగిరం చేసిన ప్రభుత్వం ఇక తన దృష్టంతా గోదావరి వరద జలాలపై పెట్టింది. ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలకు అడ్డుకట్ట వేసి వాటిని నీటి లోటుతో కొట్టుమిట్టాడుతున్న కరువు ప్రాంతాలైన దక్షిణ తెలంగాణ జిల్లాలకు పారించేలా వ్యూహం రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ, ఆ రాష్ట్ర సహకారంతో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా గోదావరి– కృష్ణా నదుల అనుసంధానం చేయాలని భావిస్తోంది.  

వరదను మళ్లిస్తేనే వరమాల... 
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మితమవుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్తవాటిని నిర్మించి.. మొత్తంగా 1.25 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గోదావరి, కృష్ణా జలాల్లో లభ్యతగా ఉన్న నీటిలో గరిష్టం ఆయకట్టుకు మళ్లించే యత్నాలు చేస్తోంది. నిజానికి గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి 1,486 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, ఇందులో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూ రు, నిజాంసాగర్‌ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉంది. మరింత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చేలా కాళేశ్వరం (180 టీఎంసీ), దేవాదుల (60), తుపాకులగూడెం (100), సీతారామ (60) వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఇవన్నీ వస్తే మరో 520 టీఎంసీల మేర నీరు వినియోగంలోకి రానుం ది. 

ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది నుంచే కనిష్టంగా 120 నుంచి 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. నికర జలాల వినియోగం పోనూ గోదావరి నుంచి ప్రతిఏటా గరిష్టంగా 6వేల టీఎంసీలు, కనిష్టంగా 1,500 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఇందు లో గరిష్టంగా ఇంద్రావతిలోనూ 800 టీఎంసీలు, శబరిలో 550 టీఎంసీలు, ప్రాణహితలో 600 టీఎంసీల మేర నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. వీటి లో గరిష్టంగా వెయ్యి టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చినా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయని కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. 

గోదావరిలో వృథాగా పోతున్న జలాలను కృష్ణా బేసిన్‌లో నీటి లోటు ఉన్న నల్లగొండ, పాలమూరు జిల్లా లతో పాటు ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించవచ్చని ఆయన చెబుతున్నారు. నిజానికి కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాలకు కలిపి 811 టీఎంసీలు ఉండగా ఇందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ప్రతి ఏటా కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకపోవడంతో ఇరు రాష్ట్రాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లో తెలంగాణలో 90 లక్షల ఎకరాల సాగు చేయగల ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం కేవలం 15 లక్షల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ నేపథ్యంలోనే గోదావరి వరద నీటిని కృష్ణా బేసిన్‌ ఆయకట్టుకు మళ్లించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.

శ్రీశైలం, సాగర్‌కు గోదావరి జలాలు
సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి కృష్ణా బేసిన్‌కు తరలించి అక్కడ నీటి కటకటతో కొట్టుమిట్టాడుతున్న ఆయకట్టుకు నీరివ్వాలన్నది సీఎం లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే అంశంపై ఆయన ఫోకస్‌ పెట్టారు. ఆదివారం ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్ల భేటీలోనూ ఇదే అంశంపై ఎక్కువ సేపు చర్చించారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, ఇంద్రావతి దిగువన ఉన్న తుపాకులగూడెం నుంచి లేక మరేదైనా పాయింట్‌ నుంచి సాగర్‌కు నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. 

దీంతో పాటే శ్రీశైలంపై ఆధారపడిన ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత లేకుండా గోదావరి జలాలను ఎలా అనుసంధానించవచ్చనే అంశాలపైనా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. వివిధ బేసిన్‌ల మధ్య నీటిని బదిలీ చేసి సమతుల్యత సాధించాలని, ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యేలా భవిష్యత్‌ ప్రణాళికలు ఉండాలని మార్గదర్శనం చేశారు. సీఎం సూచించిన అంశాలపై ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, అధికారుల స్థాయి భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement