సెమినార్లే... చర్యలుండవు
- గురుకుల ఉపాధ్యాయుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందన
- సమ్మె కొనసాగుతుందన్న టీచర్లు
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ఉపాధ్యాయుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. ఉపాధ్యాయుల బోధనా ప్రమాణాలు పెంచేందుకు న్యూ క్వాలిటీ పాలసీ-2016(ఎన్‌క్యూపీ) పేరిట కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ రూ పొందించిన విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి బీఎండీ ఎక్కాను కలసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. ఉపాధ్యాయుల ఆందోళ నలపై చర్చించి మార్పులు చేసినట్లు ప్రవీణ్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. సెమినార్ విధానాన్ని రద్దు చేయాలన్న ఉపాధ్యాయుల డిమాండ్‌ను పక్కనబెట్టి కొన్ని సడలింపులు ఇచ్చారు. న్యూ క్వాలిటీ పాలసీ, రూల్ 28, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సవరణలు చేశారు.
న్యూ క్వాలిటీ పాలసీలో మార్పులివే..
► ఎన్‌క్యూపీ సెమినార్లలో భాగంగా 50 శాతం కన్నా తక్కువ మార్కులు సాధించిన ఉపాధ్యాయులను మళ్లీ సెమినార్లకు పిలవరు. వారిలో బోధనా ప్రమాణాలు పెం చేందుకు శిక్షణ ఇస్తారు.
► సెమినార్లు నిర్వహించే సమయంలో వీడియో రికార్డింగ్ విధానం నిలిపివేత
► రెండేళ్లలో పదవీ విరమణ చేసే వారికి, తీవ్రమైన జబ్బులు ఉన్నవారికి, గర్భిణిలకు సెమినార్ల నుంచి మినహాయింపు
► ఎన్‌క్యూపీ కింద సెమినార్లలో పాల్గొన్న టీచర్లపై చర్యలు ఉండవు
► పోస్టుతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్న వారు రూల్ 28 లోకి రారు
► రూల్ 28 పరిధిలోకి వచ్చే వారి విషయంలో జూనియర్ ఇంటర్, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు
► కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది.
సమ్మెను నీరుగార్చే చర్యలివి: టీచర్ల జేఏసీ
సంక్షేమ గురుకులాల్లో ప్రవేశపెట్టిన న్యూ క్వాలిటీ పాలసీ, ఇతర అంశాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను నీరుగార్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని జేఏసీ నాయకులు వెంకటరెడ్డి, రవీందర్‌రెడ్డి, దయానంద్‌రావు, యాదయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ఈనెల 14న జరపనున్న సమ్మెకు సంబంధించి నోటీసులోని డిమాండ్లన్నింటి పై మంత్రి నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు వెనక్కు తగ్గేది లేదన్నారు. 6,7 తేదీల్లో ఈ మెయిల్ క్యాంపెయిన్ కొనసాగుతుందని, 13న మహాధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.