ఎదిగినకొద్దీ ఒదిగుండాలి! | Governor Narasimhan at the 80th convocation of Osmania Varsity | Sakshi
Sakshi News home page

ఎదిగినకొద్దీ ఒదిగుండాలి!

Published Tue, Jun 18 2019 1:45 AM | Last Updated on Tue, Jun 18 2019 1:45 AM

Governor Narasimhan at the 80th convocation of Osmania Varsity - Sakshi

సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తరహాలో ప్రతి యూనివర్సిటీ కూడా సామాజిక బాధ్యతగా పేద విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రన్‌ అధ్యక్షతన ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో 2013 నుంచి 2018 విద్యాసంవత్సరం వరకు అత్యధిక మార్కులు సాధించిన 200 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు. అలాగే 851 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ అవార్డులు ఇచ్చారు. కార్యక్రమానికి సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఆలస్యమైనందుకు క్షమించండి.. 
ఏటా నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని అనివార్య కారణాల వల్ల గత ఆరేళ్ల నుంచి నిర్వహించలేకపోయామని, ఇందుకు విద్యార్థులంతా క్షమించాలని నరసింహన్‌ కోరారు. ఇకపై ఆ పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. వర్సిటీ అకాడమీ కేలండర్‌లో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఎలా పొందుపర్చామో.. అలాగే వర్సిటీ స్నాతకోత్సవ తేదీ పొందుపర్చాలని సూచించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏటా స్నాతకోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. 

ఎదిగే కొద్ది..ఒదిగి ఉన్నప్పుడే గుర్తింపు 
విద్యార్థులు ఉన్నతస్థితికి చేరుకున్నా.. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వారిని గౌరవించాలని సూచించారు. ‘గతంలో గురువులకు, శిష్యులకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది. అంతా కలసి కుటుంబసభ్యుల్లా మెలిగేవారు. మంచి విద్యను అందించడంతో పాటు సత్యం, ధర్మం, వినయం, విధేయత, కష్టించేతత్వాన్ని నేర్పించేవారు. విద్యార్థి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇవి ఎంతో తోడ్పడేవి. ప్రస్తుతం గురు శిష్యులకు మధ్య అగాథం పెరిగింది. దీన్ని తగ్గించాలి. మనిషికి చదువు, ఉద్యోగం, సంపాదన, హోదాతో గుర్తింపు రాదు.. వినయం, విధేయతతోనే అసలైన గుర్తింపు దక్కుతుంది. మనిషి ఎదిగేకొద్ది వినయం పెరగాలి’అని పేర్కొన్నారు. 

పీహెచ్‌డీ అవార్డు గ్రహీతల్లో అసంతృప్తి 
స్నాతకోత్సవంలో నరసింహన్‌ చేతుల మీదుగా పీహెచ్‌డీ అవార్డు అందుకోవాలని ఆశపడ్డ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, కామర్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సోషల్‌ సైన్స్‌ పీజీ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు దాతల పేరుతో ఏర్పాటు చేసిన బంగారు పతకాలు అందజేసి ఆ తర్వాత వెళ్లిపోయారు. దీంతో ఎస్‌.చంద్రశేఖర్, వీసీ రాంచంద్రం చేతుల మీదుగా అవార్డులు తీసుకోవాల్సి వచ్చింది. చాన్స్‌లర్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకోవచ్చని ఆశపడ్డ పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయకుండా వెళ్లిపోవడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తమ పిల్లలు అవార్డులు తీసుకుంటుండగా చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులకు నిరాశే మిగిలింది. భద్రత కారణాలు, ఆడిటోరియంలో విద్యార్థులు, అధ్యాపకులకు తగిన కుర్చీల్లేకపోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా చెట్ల కిందే కూర్చున్నారు.

క్రమశిక్షణలో రాజీపడొద్దు.. 
దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, దీన్ని ఇలాగే కాపాడుకోవాలని నరసింహన్‌ సూచించారు. క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్లుగా వర్సిటీలు సిలబస్‌ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మానవ వనరులకు ఉండాల్సిన నైపుణ్యం, వర్సిటీల్లో బోధిస్తున్న విద్యకు మధ్య భారీ తేడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని పూరించాల్సిన బాధ్యత గురువులపైనే ఉందన్నారు. ప్రతి విద్యార్థి భారతీయుడిగా గర్వపడాలని, మనకు లేనిదంటూ ఏమీ లేదని, దేశానికి గొప్ప సంస్కృతి ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అత్యంత కీలకమని, ఈ విషయంలో రాజీపడితే వారు భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement