
సాక్షి, హైదరాబాద్: విద్యా కార్యక్రమాలు రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయో తెలుసు కోడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్య కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు లాంటి 10 రకాల ప్రధాన విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు ఆధారంగా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 30 నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించిన స్కూళ్ల శాతం ఆధారంగా ఈ గ్రేడింగ్ ప్రకటించనుంది.
ఒక్కో అంశానికి 10 శాతం వెయిటేజీ ఆధారంగా మొత్తం 100 శాతంగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ప్రక టించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) వెల్లడిం చింది. ఆ పది ప్రధానాంశాల అమలుకు సంబంధించిన వివరాలు, నివేదికలను ఎంహెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌లో అక్టోబర్ 1లోగా అన్ని రాష్ట్రాలు అప్‌లోడ్ చేయాలని.. ఆ వెంటనే గ్రేడ్లు ప్రకటిస్తామంది. విద్యా కార్య క్రమాల అమలు ఆధారంగానే భవిష్యత్‌లో రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర నిర్ణయం నేపథ్యంలో వివరాలు అప్‌లోడ్ చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
10 ప్రధానాంశాలివే..
♦ ఉపాధ్యాయుల ఫొటోలను పాఠశాల నోటీసు బోర్డులో పెట్టిన స్కూళ్లు ఎన్ని.. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్ల ఫొటోలను నోటీసు బోర్డులో ఉంచాలని గతంలో కేంద్రం జారీ చేసిన ఆదేశాలు అమలు చేసిన స్కూళ్ల సంఖ్య.
♦ తరగతుల వారీగా అభ్యాసన సూచికలు నోటీసు బోర్డులో ఉంచిన పాఠశాలలెన్ని, ఎన్ని పాఠశాలలు 100% అమలు చేశాయి.
♦ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అందిస్తున్న సహాయం, వారి ఉపకరణాలకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, అందులో ఏ మేరకు ఖర్చు చేశారు.
♦ సర్వశిక్షా అభియాన్ కింద 2017–18లో తొలిసారి ఒకటి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలకు కేంద్రం ని«ధులిచ్చింది. అందులో ఎంత మొత్తం నిధులొచ్చాయి. విద్యార్థులకు ఎన్ని పాఠ్య పుస్తకాలిచ్చారు.
♦ విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాంలు ఇచ్చేందుకు నిధిలిస్తున్నారు. వీటి ద్వారా ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.
♦ వృత్యంతర శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సంఖ్య, ఉపాధ్యాయ శిక్షణకు కేంద్రం నుంచి పొందిన నిధులెన్ని, ఏ మేరకు ఖర్చు చేశారు.
♦ పాఠశాలల్లో చేరని విద్యార్థుల సంఖ్య ఎంత, వారిలో ఎంత మందిని చేర్పించారు.
♦ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా స్కూల్ గ్రాంట్ పొందిన స్కూళ్లు ఎన్ని, తీసుకున్న గ్రాంట్‌ను ఎన్ని పాఠశాలలు వినియోగించాయి.
♦ ఎంత మంది విద్యార్థులకు ఆధార్ ఉంది, ఎన్‌రోల్‌మెంట్‌లో 100 శాతం ఆధార్ అనుసంధానం చేసిన స్కూళ్లు ఎన్ని.
♦ ఎన్ని స్కూళ్లను ఇంజనీరింగ్, ఎన్‌ఐటీలు, ఐఐటీ విద్యా సంస్థలతో అనుసంధానం చేసి విద్యార్థులను భాగస్వాములు చేస్తున్నారు.