సంబుర’ సన్నాహం...! | Grand telangana celebrations in mahabubnagar district | Sakshi
Sakshi News home page

సంబుర’ సన్నాహం...!

Published Sun, Jun 1 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

Grand telangana celebrations in mahabubnagar district

అరవై ఏళ్ల కల ఆచరణ రూపు దాల్చిన శుభఘడియలు చేరువవుతుండడంతో వేడుకల కోసం జిల్లా ముస్తాబవుతోంది. పోరు బిడ్డల త్యాగాన్ని స్మరించుకుంటూ నవరాష్ట్ర ఆవిర్భావ వేల పులకితమవ్వాలనుకుంటోంది. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త విద్యుత్తు కాంతులతో మెరిసిపోయేలా అలంకరించారు. అన్ని వర్గాల్లో ఉత్సవ జోష్‌ను నింపేందుకు కళాకారులు గజ్జెకడుతున్నారు. కవులూ కలాలకు పదును పెట్టి ‘తెలంగాణం’ వినిపించేందుకు సిద్ధపడుతున్నారు.
 
 పాలమూరు, న్యూస్‌లైన్: అరవై ఏళ్ల కల సాకారమైన వేళ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పలువురి ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు.. ఎందరో ఉద్యమాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సంబురాలు.. జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
 
 గతేడాది జులై 30వతేదీన ప్రకటించిన నాటినుంచి ఇక్కడి ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. జూన్ రెండోతేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకునేందుకు జిల్లా కేంద్రంతోపాటు అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొల్పేందుకు అన్ని స్థాయిల్లోనూ ప్రత్యేక దృష్టి నిలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున తెలంగాణ సంబురాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు చేపట్టనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ముమ్మరంగా చేపట్టనున్నారు.
 
 కొత్త అందాలు..
 రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, జిల్లాపరిషత్ కాార్యాలయం, అన్ని డివిజన్‌ల పరిధిలోని ఆర్‌డీఓ కార్యాలయాలు, తహశీల్దారు, మండల పరిషత్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. చారిత్రక ప్రాంతాలు, దేవాలయాల ప్రాంగణాలను సైతం అలంకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వీటితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇతర సంస్థల ఆధ్వర్యంలో రెండోతేదిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, తెలంగాణ వాదుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.  మన జిల్లా సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యమైన కూడళ్లలో అవసరమైన ఫ్లెక్సీలతోపాటు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టనున్న వేడుకల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది, యువతీ, యువకులు, జిల్లా వాసులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 జూన్ 2న.. కాప్స్ కవాతు
 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం ఉదయం 8.45 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నేటి సాయంత్ర నుంచే జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా సాంసృ్కతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు.
 
 స్ఫూర్తినిచ్చే కళారూపాలు...
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత- చారిత్రక నేపథ్యం ఆధారంగా జిల్లా వ్యాప్తంగా కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. అంతేకాకుండా వారం రోజులపాటు జరుగనున్న ఉత్సవాల్లో తెలంగాణ సాధనలో అమర వీరుల త్యాగం, ఉద్యమ నేపథ్యం వంటి అంశాలపై కూడా రూపకాలు, కళా రూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని సాంసృ్కతిక సంస్థలు, జానపద కళాకారులు, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, గాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
 
 ఆఫీసులకు టీజీ బోర్డులు
 జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ అన్న పేరున్న బోర్డులను తొలగించి వాటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం పేరిట కొత్త బోర్డులను ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఆదివారం సాయంత్ర వరకు బోర్డులను మార్పు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో ఏర్పాట్లు చేశారు.
 
 సమీక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్
 తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ పరంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు ఆయా శాఖల అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎల్.శర్మణ్ ఆదివారం రెవిన్యూ సమావేశ మందిరంలో సమీక్షించారు. జిల్లా నలుమూలల ఆవిర్భావ వేడుకలు ఉట్టిపడే విధంగా పూలతోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేస్తామని, జిల్లాలోని ప్రముఖులను కూడా సత్కరించడం జరుగుతుందన్నారు. ముఖ్యమైన ఆస్తుల పంపిణీ వివరాలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు శర్మణ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా మానవహారాలు, ర్యాలీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని, ప్రతి కార్యక్రమంలో తెలంగాణ వాదం కనపడాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించిన విధంగానే ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని తెలిపారు.
 
 పతి కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. వారం రోజుల పాటు విసృ్తతంగా సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి కళాకారులు, కవులు, రచయితలు, వీటిపై ఆసక్తి ఉన్నవారు జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎల్.శర్మణ్ సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement