
గ్రేటర్ త్రీ స్టార్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రస్తావించడంతో విభజనకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
- మారనున్న జీహెచ్‌ఎంసీ?
- సీఎం వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ
- విభజన అనివార్యమైతే.. ఆ తరువాతే ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రస్తావించడంతో విభజనకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వివిధ కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడంతో మళ్లీ ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తర్వాతే ఎన్నికలు జరిగే వీలుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై తదితర నగరాలలో సైతం రెండు నుంచి ఐదు కార్పొరేషన్ల వరకున్నాయి. అదే తరహాలో గ్రేటర్‌ను విభజించనున్నారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. అన్ని అంశాలను పరిశీలించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన సూచనా ప్రాయంగా పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 50 నుంచి 70 వార్డులు ఉంటాయి. ఇది తర్వాతే ఇక కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు గ్రేటర్‌లోని డివిజన్లను డీ లిమిటేషన్ చేయాలని.. డివిజన్లలోని జనాభాలో వ్యత్యాసం పది శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదని హైకోర్టు సూచించింది.
గ్రేటర్‌లో జనాభా కోటిని దాటి పోవడంతో డీలిమిటేషన్ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీలోని ఐదు జోనల్ కార్యాలయా ల్లో ఐఏఎస్ అధికారులను నియమించి వారికి పర్యవేక్షణ బాధ్యతలప్పగిస్తే పరిపాలన సజావుగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయంగా ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో కేసీఆర్ జీహెచ్‌ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా చేసేయోచనలో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలతో వెల్లడవుతోంది.
ఎన్నికలు ఆలస్యం.. ?
జీహెచ్‌ఎంసీని విభజించకపోయినప్పటికీ జనాభా ప్రతిపదికన డివిజన్ల డీ లిమిటేషన్ జరగాల్సి ఉంది. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30 సర్కిళ్లుగా మార్చాల్సి ఉంది. జనాభా దామాషాలో కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 18 సర్కిళ్లలో కొన్నింట్లో ఎక్కువ జనాభా ఉండగా, మరికొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. కొత్తగా ఏర్పాటయ్యే 30 సర్కిళ్లలో జనాభా దాదాపుగా సమానంగా ఉండేలా డీలిమిటేషన్ జరగాలి. జీహెచ్‌ఎంసీకి ఎన్నికల కన్నా ముందే ఈ ప్రక్రియ పూర్తికావాలి . ఇది పూర్తి కావాలంటే ఆరు నెలల నుంచి ఏడాది దాకా పట్టనుంది. దాంతో, మరికొంత ఆలస్యమైనా జీహెచ్‌ఎంసీ విభజన కూడా జరగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.