దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమలయ్యేనా ?
ఢిల్లీలో నేడు 14వ ఆర్థిక సంఘంతో ఆర్థికమంత్రుల భేటీ హక్కు కోల్పోతామంటున్న రాష్ట్రాలు
హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను ల విధానం తీసుకొచ్చేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కసరత్తు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న సర్వీస్‌టాక్స్, సేల్స్‌టాక్స్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కేంద్రం ద్వారానే ‘సరుకు, సేవా పన్ను (జీఎస్‌టీ)’ను దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జీఎస్‌టీ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలే వ్యతిరేకించినందున ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను నయానో, భయానో ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మోడీ హయాంలో గత జూలై 3న, ఆగస్టు 20న అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్రం సమావేశమైంది. మూడోవిడతగా బుధవారం నాడు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఢిల్లీలో ఆర్థికమంత్రుల సాధికారిక కమిటీ సమావేశమవుతోంది. సమావేశంలో జీఎస్‌టీపై కీలక నిర్ణ యం తీసుకోవాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా ఢిల్లీ వెళ్లారు.
రాష్ట్రాల వ్యతిరేకతకు కారణం ఇదే..
అమ్మకం పన్నుల విధింపు అధికారం రాజ్యాం గం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించింది. దీని ప్రకారం వస్తు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు అమ్మకం పన్నులు ఆయా రాష్ట్రాలే నిర్ణయించి విధిస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సీఎస్‌టీ (కేంద్ర అమ్మకపు పన్ను) 2004 వరకు 4 శాతం ఉండేది. దీనిలో వాటా మాత్రమే కేంద్రానికి దక్కేది. 2005లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను కేంద్రం తీసుకొచ్చిన తర్వాత సీఎస్‌టీ 2 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వ్యాట్ ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరింది. వ్యాట్ వల్ల కోల్పోయిన నష్టాన్ని పూడుస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో జీఎస్‌టీని తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్రాల సహాయ నిరాకరణ వల్ల అమలు కాలేదు. ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడానికి ముందుకొస్తోంది.
జీఎస్‌టీ వల్ల ఏం జరగబోతుంది..?
► సేవా రంగంలో పన్నులు వేసే అధికారం రా ష్ట్రాలకు సంక్రమిస్తుంది. వాణిజ్య, వ్యాపార పన్నుల అధికారం కేంద్రం చేతిలోకి వె ళ్తుంది.
► దేశమంతా ఒకే పన్నుల విధానం అమలు.
► రాష్ట్రాల మధ్య పన్నుల రేట్లలో ఉన్న తేడాలు తొలగిపోతాయి.
► దేశమంతా సింగిల్‌మార్కెట్‌గా మారుతుంది.
► విదేశీ మార్కెట్‌లో దేశానికి ప్రాధాన్యం పెరుగుతుంది.
► వ్యాట్ వల్ల ధరలు దేశవ్యాప్తంగా ఏకీకృతమయినట్టే పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వస్తుంది.
► అదే సమయంలో ఒకే వ్యాపారి/ ఉత్పత్తిదారుడుపై కేంద్రం, రాష్ట్రం పెత్తనం(డ్యుయల్ కంట్రోల్) ఉంటుంది.
► చట్టాన్ని అమలుపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య వివాదాలు ఏర్పడే ఆస్కారం.
► జీఎస్‌టీ అమలైతే రాష్ట్రాల పన్నుల విధానంలో సమూల మార్పులకు అవకాశం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వీర్యం.
► రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖల్లోని ఉద్యోగుల హోదాల్లో మార్పులకు అవకాశం.
జీఎస్‌టీ పరిహారానికి రాజ్యాంగబద్ధత కల్పించాలి: యనమల
వస్తు అమ్మకం పన్ను (జీఎస్‌టీ) అమలు చేయ డంలో అభ్యంతరం లేదని, అయితే వ్యాట్‌కు బ దులు జీఎస్‌టీని అమల్లోకి తేవడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో తగ్గుదలను కేంద్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. జీఎస్‌టీ అమలుపై కేంద్ర సాధికారిక కమిటీ బుధవారం ఢిల్లీల్లో నిర్వహించే సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరు కానున్నారు. జీఎస్‌టీ రాజ్యాంగబద్ధత కల్పించాలని మంత్రి యనమల సాధికారిక కమిటీకి స్పష్టం చేయనున్నారు.
జీఎస్‌టీ అమలైతే...
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్‌టీ) పేరుతో ఏకీకృత పన్నుల విధానం అమలైతే దేశంలో అన్నిరాష్ట్రాల్లో ఒకే పన్నుల విధానం అమలులోకి వస్తుంది. రాష్ట్రాలు సొంతగా పన్నులు విధించే హక్కును కోల్పోతాయి. దీంతో సేవాపన్నుల విధానాన్ని కేంద్రం రాష్ట్రాలకు దఖలు పరిచేందుకు సిద్ధమైంది. గుజరాత్ రాష్ట్ర ఆర్థికమంత్రి గత నెల 20న జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో జీఎస్‌టీ విధానంపై పెదవి విరిచారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌పై కేంద్రం పన్నుల పెత్తనాన్ని తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు గతంలో వ్యాట్‌నే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా తమ హక్కులను కేంద్రం హరిస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. జీఎస్‌టీ అమలైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటనే అనుమానాన్ని సగం రాష్ట్రాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమకు రాజకీయ హామీలు కాకుండా చట్టపరమైన హామీ కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి.