
ఉదయభానును అభినందిస్తున్న ప్రవీణ్‌కుమార్
సాక్షి, సూర్యాపేట : అతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి గురుకుల విద్యాసంస్థలో విద్యాబుద్దులు నేర్చుకోని అమెరికాలోని ఇలినోయ్ రాష్ట్రంలోని కాలేజ్ ఆఫ్ డుఫేజ్‌లో వ్యవసాయ ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఎంపికైంది. సూర్యాపేట మండలం బాలెంల గ్రామ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని బొల్లేద్దు ఉదయభాను. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లేద్దు హనుమంతు, అం డాలు అతి సామాన్య రైతు కుటుబం. వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారికి మూడో సంతానం బొల్లేద్దు ఉదయభాను. 1 నుంచి 5వ తరగతి వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో విద్యనభ్యసించింది. తదుపరి ఇమాంపేట గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించింది.
ఇంటర్ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం బాలెంల గ్రామ సమీపంలో గల గురుకుల మహిళా డిగ్రీ కళా శాలలో ఎంజెడ్‌సీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. మొదటి నుంచి చదువులో ముందంజలో ఉండే ఉదయభాను వ్యవసాయంపై సంవత్సరం పాటు అమెరికాలో నిర్వహించే ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల తోటి విద్యార్థులు, కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ఉదయభానుకు అభినందనలు తెలుపుతున్నారు.
వ్యవసాయంలో నవీన మార్పులు..
వ్యవసాయం గూర్చి సంవత్సరం పాటు అమెరికాలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి తిరిగి ఇండియాకు వచ్చాక అక్కడ వ్యవసాయంలో నేర్చుకున్న నైపుణ్యాలను తన తల్లిదండ్రుల ఆశయాల మేరకు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని తనకు ఉందని ఉదయభాను పేర్కొంది. దేశంలోని రైతులకు నవీనమైన వ్యవసాయ మెలుకువలు వివరించి పంట దిగుబడి పెంచి వ్యవసాయదారుల ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలనే తన ఉద్ధేశమని ఉదయభాను చెప్పారు.
అతి సామాన్య రైతు కుంటుంబంలో పుట్టిన తాను వ్యవసాయరంగంలో మార్పులు తెచ్చేందుకు తన వంతుగా కృషి చేయాలనే లక్ష్యంతో వ్యవసాయరంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. అదే విధంగా అమెరికా నుంచి వచ్చాక ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన తన సోదరితో కలిసి వ్యవసాయ రంగంలో పరిశోధన చేస్తూ తక్కువ నీటి వనరులతో, చీడపీడలను ఎదుర్కొని అధిక దిగుబడులను ఇచ్చే స్వల్పకాలిక వంగడాల సృష్టికి కృషి చేస్తానని వెల్లడించింది . తాను అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పించిన టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటయ్యకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉదయభాను తెలిపారు.
ఎంపిక ఎలా
యూనైటేడ్ స్టేట్స్ అమెరికా ప్రభుత్వం నిర్వహించిన కమ్యూనిటీ కాలేజ్ ఇనుస్ట్యూట్ ప్రొగ్రాంకు తెలంగాణలోని 30 సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్తినులు పోటీ పడగా సూర్యాపేట ప్రాంతం నుంచి ఉదయభాను ఎంపికైంది. ఎనిమిది నెలలుగా జరుగుతున్న వివిధ పరీక్షల్లో నెగ్గుతూ వచ్చింది. ఈ ఎంపిక ప్రక్రియలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సంస్థ రెండు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించగా పరీక్షలో ఉదయభాను నెగ్గింది. తదుపరి మౌఖిక పరీక్షలు, గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు.
అనంతరం సీసీఐపీ అప్లికేషన్ ద్వారా ఇంగ్లీష్ రాత పరీక్షలో ఎంపికై యూఎస్ కౌన్సిలేట్‌లో సెకండ్‌లెవల్ ఇంటర్వ్యూలో నెగ్గి మూడో లెవల్‌లో టోఫెల్ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అనంతరం పాస్‌ఫోర్ట్, వీసా పొందింది. ఈ నెల 16న అమెరికాకు వెళ్లేందుకు ఉదయభాను ఇప్పటికే సిద్ధమైంది. ఇటీవల గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను ఉదయభాను హైదరబాద్‌లో కలవడంతో ఉదయభాను అభినందించి స్వీట్ తినిపించారు.