
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెటింగ్ పెద్ద సవాల్‌గా మారిందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వ్యవసాయ ఆధారిత రంగాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎగుమతి రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని, కానీ రైతుకు ఇప్పుడు ప్రధాన సమస్య మార్కెటింగ్ అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారానే అదనపు విలువ జోడించినట్లవుతుందన్నారు. దీనివల్లే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. 2020–21 రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను నాబార్డు సిద్ధం చేసింది. దాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ ఫోకస్ పేపర్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు దాని ఆధారిత రంగాలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ అంతే ప్రోత్సహించాలని నాబార్డును కోరారు. ఈ ఏడాది నాబార్డ్ హైటెక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా, ఇప్పుడు సీఎంగా ఉన్నా రైతుగా నిత్యం పనిచేస్తున్నారని చెప్పారు.
బడ్జెట్లో వ్యవసాయానికి 30 శాతం..
బడ్జెట్ మొత్తంలో 30 శాతానికి పైగా వ్యవసాయ రంగానికే ఖర్చు చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. అందులో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుబీమా కోసం రూ.1,136 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గతంలో రుణమాఫీ అమలుచేశామని, ఇప్పుడు కూడా అందుకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీంతో రైతుల్లో భరోసా ఏర్పడిందన్నారు. దీంతో ఉన్నత చదువులు చదివినవారు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
రైతుల రెవెన్యూ రికార్డులను 96 శాతం పరిష్కరించామని, మరో 4 శాతం లీగల్ కేసులకు సంబంధించినవని చెప్పారు. పంట రుణాలకే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని నాబార్డును, బ్యాంకర్లను కోరారు. గొర్రెల పంపిణీ వల్ల వాటి నుంచి 80 లక్షల కొత్త గొర్రె పిల్లలు పుట్టినట్లు వివరించారు. వీటి విలువ రూ.3500 కోట్లు ఉంటుందని తెలిపారు. మత్స్య సొసైటీలు దేశంలో అధికంగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 64 కోట్ల చేప పిల్లలను, 3.4 కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో ఉచితంగా వేశామన్నారు. ఫిషరీస్‌లో దేశంలోనే కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టామన్నారు.
వ్యవసాయ రంగంలో కూలీల కొరత..
వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు. పెద్ద రైతులకు ఉపయోగపడే యంత్రాలు కాకుండా, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా యంత్రాలకు సహకారం అందించాలని చెప్పా రు. వరి నాట్లు, కలుపు తీసే యంత్రాల కోసం ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, దీనికి బ్యాం కులు సహకరించాలని కోరారు. వ్యవసాయ రంగానికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి, వ్యవసాయ యంత్రాలకు ఎక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం సరికాదన్నారు. కాబట్టి తక్కువ వడ్డీకే యంత్రాలు కొనుగోలు చేసేలా సౌలభ్యం కల్పించాలన్నారు. నాబార్డు నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment