సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: భవిష్యత్తులో ప్రతి గ్రామంలోని ప్రజలు పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా మారి ఆరోగ్య గ్రామంగా ‘వెల్కమ్ టూ హెల్త్ విలేజ్’ అనే బోర్డులు పెట్టే స్థాయికి మనం చేరుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులుకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగానే ముందుగా ప్రతి గ్రామంలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరి యోగాను అచరించాలన్నారు. నిజమైన అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అన్నారు. ఆరోగ్యంగా ఉండి చేతి నిండా పని లభించి సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధిగా భావించాలన్నారు. ప్రతి గ్రామానికి ఇది ఆరోగ్య గ్రామం అనే బోర్డులు పెట్టే రోజులు రావాలన్నారు.
ఇప్పుడు సమాజాన్ని రెండు వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని వాటిలో ఒకటి సెల్‌ఫోన్ కాగా మరొకటి మద్యం అన్నారు. యువత శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయన్నారు. సమాజంలో ఒక మార్పును తెచ్చే దిశగా జరుగుతున్న ప్రక్రియకు సిద్దిపేట నియోజకవర్గం నాందిగా నిలవాలన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లాలు, జైల్లు, కోర్టులు చుట్టు తిరగడం జరిగిందని ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశానన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ అంటూ చెట్లు, గుట్టలు, పుట్టలు, వాగులు, వంకలు తిరిగానన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, దగ్గరుండి ప్రజల బాగోగులు చూసుకునే అవకాశం కలగడం అదృష్టంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం యోగ, పేద విద్యార్థుల కోసం ట్యూషన్, ప్రతి గ్రామంలో ఉచిత అంత్యక్రియలు ఇలా అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగ, ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమాజంలో మార్పు కోసం గ్రామాలలో ఉదయం యోగ తరగతులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా ప్రతి ఇంటిలో తులసి, వేప మొక్కలను తప్పనిసరిగా పెంచాలన్నారు. గ్రామాలు అపరిశుభ్రంగా మారకుండా ఉండేందుకు గొర్రెలు, బర్రెలు ఆరోగ్యంగా ఉండేందుకు వాటికోసం హాస్టల్స్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో యోగ తరగతులను నిర్వహించే క్రమంలో ముందుగా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జీవితంలో ఒక భాగంగా యోగాను గుర్తించాలన్నారు. యోగ ద్వారా కలిగే లాభాలను తెలుసుకున్న తర్వాతే విద్యార్థులకు యోగాసనాలు సులభంగా నేర్పే అవకాశం కలుగుతుందన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బ్రిజ్ బూషన్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంత్‌రావు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఎంఈఓలు,ఉపా«ధ్యాయలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment