హరీష్ రావు సీఎం కావడం ఖాయం
మంత్రి హరీశ్‌రావు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత అవినీతికి పాల్పడుతూ మంత్రి హరీశ్‌ను ఒంటరి చేశారని ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబ పాలనను బుద్ధి చెప్పేవరకు ప్రజలు నిద్రపోరని, దీనికి ఈ పాదయాత్ర నాంది పలుకుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణను పథకం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని, మాదిగలంటే ఆయనకు చులకనగా ఉందని ఆయన మండిపడ్డారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోయినా కేసీఆర్ తప్పుడు హామీలతో వారిని మోసగిస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు అమరసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు శంశొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.