‘పుర’ కార్మికులకు హెల్త్ కార్డులు
► ఇళ్లు లేనివారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు
► పారిశుధ్య కార్మికులకు మంత్రి కేటీఆర్ హామీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు హెల్త్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని అర్హులైన పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక కోటాను సృష్టించే అంశాన్ని పరిశీలి స్తామని చెప్పారు. రాష్ట్రంలోని పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ మంగళవారం ఇక్కడ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమ వేతనాలు పెంచాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్ రూంఇళ్లు మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, రక్షణ పరికరాలు అందించాలని కార్మికులు తమ డిమాండ్లను మంత్రి ముందుంచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆర్థిక పరిపుష్టి గల పురపాలికల్లో పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచితే ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే సరిపడా ఆదాయం లేని చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో తీసుకోవాల్సిన శాఖాపరమైన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈఎస్‌ఐ, పీఎఫ్‌ను కార్మికులకు అందజేస్తామ ని హామీ ఇచ్చారు. సమాన పనికి సమాన వేతనం అమలుకు కొంత సమయం కావాలని కోరారు. కార్మికులకు కొన్ని నెలలుగా జీతాలి వ్వని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమా వేశం నిర్వహిస్తామని, వేతన బకాయిలు చెల్లిం చేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని శ్రామిక వర్గాలు, ఉద్యోగులందరీ జీతాలు ప్రభుత్వం పెంచిందని, పురపాలికల్లో పారిశుధ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికులను సీఎం కేసీఆర్ దేవుళ్లతో సమానమని పోల్చారని గుర్తుచేశారు. సీఎంకు కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన, సానుభూతి ఉందని, కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఇళ్లలో పని చేయించుకుంటే సస్పెన్షన్
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులతో తమ ఇళ్లల్లో పనిచేయించుకుంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనల గురించి నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారమిస్తే తక్షణమే సంబంధిత మున్సిపల్ కమిషనర్లను సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరాలు, పట్టణాల కోసమే పని చేయాలని, ప్రజాప్రతినిధుల కోసం కాదన్నారు. కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు ఇచ్చామని, ఇంకా అవసరమైతే సరఫరా చేస్తామని, వీటిని వినియోగించేలా కార్మికుల ను చైతన్యపరచాలని చెప్పారు. సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.