
లెక్కకు మిక్కిలి!
‘సంక్షేమ’ దరఖాస్తులు జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆహారభద్రత, సామాజిక పింఛ న్లకు లెక్కకు మిక్కిలిగా అర్జీలు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 9,38,324 రేషన్‌కార్డులుండగా, తాజాగా వీటికి అదనంగా 1,66,229 మంది ఆహారభద్రత కార్డుల కోసం శనివారం నాటికి దరఖాస్తు చేసుకోగా, అర్జీలకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంక్షేమ పథకాలకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించడంతో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఆహారభద్రత, సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు పెట్టుకుంటున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని భావించిన కేసీఆర్ సర్కారు.. ఇటీవల బోగస్ రేషన్‌కార్డులను ఏరివేసింది.
ఈ క్రమంలో దాదాపు లక్షన్నర కార్డులను అధికారులు తొలగించారు. తొలగించిన కార్డులను అటుంచితే.. అంచనాలకు మించి ఆహారభద్రతకు దరఖాస్తు చేసుకోవడం యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మూడు నెలలు కష్టించి బోగస్ కార్డులు ఏరివేస్తే.. ప్రభుత్వ నిర్ణయంతో తమ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. బోగస్ కార్డుల పేరిట హడావుడి చేసి.. ఇప్పుడు మరోసారి దరఖాస్తులు పరిశీలించాలనడంలో అర్థంలేదని అభిప్రాయపడ్డారు.
ఆహారభద్రతకు 118శాతం!
‘ఆహారభద్రత’కు ఇప్పటివరకు 11,04,553 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కార్డులతోపోలిస్తే ఇది 118శాతం అధికం. సరూర్‌నగర్ (270%), కీసర(230%), కుత్బుల్లాపూర్ (176%), హయత్‌నగర్ (170%), ఘట్‌కేసర్(150%)లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. నగరీకరణ నేపథ్యంలో ఇక్కడ కార్డుల కోసం అడ్డగోలుగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తున్నవారు కూడా కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
వలసలు అధికంగా ఉండడంతో శివార్లలో అర్జీల సంఖ్య కూడా అదేస్థాయిలో నమోదవుతోంది. మల్కాజిగిరి, అల్వాల్, ఎల్‌బీనగర్, ఉప్పల్ డివిజన్లలో ప్రస్తుత కార్డులకంటే దరఖాస్తులు తక్కువ రాగా, గ్రామీణ ప్రాంతంలో కేవలం షాబాద్ మండలంలో ఉన్నవాటికంటే తక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేంద్రాలు సంఖ్య తక్కువగా ఉండడంతో దరఖాస్తుదారులు అర్జీలు సమర్పణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే దరఖాస్తులు ఇంకా ఊపందుకోనట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సమర్పణకు డెడ్‌లైన్‌లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు కూడా దరఖాస్తులకు తొందరలేదనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
పింఛన్లకు భారీగా దరఖాస్తులు
సామాజిక పింఛన్లకు కూడా అర్జీలు వెల్లువెత్తాయి. వృద్ధులు, వితంతు, వికలాంగులు 4,55,296 మంది లబ్ధిదారులుండగా, ఇప్పటికే 5,99,041 దరఖాస్తులు వచ్చాయి. అంటే అదనంగా 1,43,745 మంది దరఖాస్తు చేసుకున్నారన్నమాట. అర్జీల సమర్పించేందుకు వ్యవధి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది. గ్రామీణ మండలాల్లో 1,90,014 లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటివరకు 2,54,992 దరఖాస్తులు అందాయి. అదే గ్రేటర్‌లోని పది సర్కిళ్లు, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 2,65,282 మంది లబ్ధిదారులు ఉండగా, 3,44,048 దరఖాస్తులు వచ్చాయి. ఇది ఉన్నవాటికంటే 129 శాతం అధికం. శంషాబాద్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా పింఛన్ల కోసం అర్జీలు వచ్చాయి.