వేములపల్లి : అలుగుపోస్తున్న ఆమనగల్లు చెరువు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా తడిసి ముద్దయ్యింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వరుణుడు ము ఖం చాటేశాడు. దీంతో వర్షాధారమైన పత్తి సాగు చేసిన రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. కొందరు ఒకటికి రెండు పర్యాయాలు విత్తనాలు నాటాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు మెట్ట పంట లకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఖరీఫ్ గట్టెక్కినట్టేనని వారు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నిండడంతో నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి అందుబా టులో ఉన్న గణాంకాల మేరకు సాగర్‌లో నీటి మ ట్టం 545.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 2,08,464 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. మరో వైపు ఏఎమ్మార్పీ ద్వారా ఉదయసముద్రానికికృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో సోమవారం మిర్యాలగూడలో సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం 1,267.4 మి.మీటర్ల వర్షం కురవగా, జిల్లా సరాసరి వర్షపాతం 40.9 మి.మీగా నమోదైంది.
అలుగుపారుతున్న చెరువులు..
మిర్యాలగూడ : మాడుగులపల్లి మంండలంలో భీమనపల్లి, కల్వెలపాలెం, పోరెడ్డిగూడెం, చర్లగూడెంలోని చెరువులు వర్షపు నీరు పెరిగి అలుగులు పొస్తున్నాయి. పాలేరు వాగుకు వర్షపు నీటి ఉధృతి పెరిగిపోవడంతో కల్వలపాలెం–బొమ్మకల్లు, భీమనపల్లి–బొమ్మకల్లు, భీమనపల్లి –ఆగామోత్కూర్ కల్వర్టులు తెగిపోయాయి. భీమనపల్లి, కల్వెలపాలెం, పాములపాడు గ్రామాలకు వెళ్లడానికి చిరుమర్తి ద్వారా వెళ్లాల్సి వస్తోంది. మండలంలో దాదాపు 150 ఎకరాల పత్తిచేలల్లో వర్షపునీరు నిలిచింది. చిరుమర్తి, పోరెడ్డిగూడెం గ్రామాల్లో చెరువులు అలుగుపోయడంతో పాటు పాములపాడులో నల్లవాగు పొంగి పొర్లడం వల్ల 150 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి.
వేములపల్లి మండలంలో ఆమనగల్లు, శెట్టిపాలెం చెరువులు వర్షపు నీటితో అలుగుపోస్తుండగా మొల్కపట్నం, సల్కునూరు, రావులపెంట చెరువులు వర్షపు నీటితో నిండుకుండలాగా కళకళలాడుతున్నాయి. చెరువులు అలుగుపోయడం వల్ల సుమా రు 50 ఎకరాల వరిపొలం నీటిలో మునిగింది. అదే విధంగా గ్రామాల్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. మిర్యాలగూడ మండలంలోని చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఉట్లపల్లి, బాదలాపురం గ్రామాల్లో సుమారు 10 ఎకరాల వరి పొలం నీటిలో మునిగింది.
సాగర్ నియోజకవర్గంలో..
త్రిపురారం : సాగర్ నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర, తిరుమలగిరి, త్రిపురారం, గుర్రంపోడు, నిడమనూరు మండలాల్లో ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటలు ఆలుగు పోసిన దాఖలాలు లేవు. బీడు భూముల్లో, పత్తి చేల్లో మాత్రం వర్షం నీరు నిలిచింది. ముసురు వర్షం వల్ల ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాలలోని బోరు, బావుల కింద సాగు చేసిన వరి, పత్తి పంటలకు ఈ వర్షం జీవంపోసినట్లయింది.
‘దేవరకొండ’లో..
దేవరకొండ : కొండమల్లేపల్లి, చందంపేట, పీఏపల్లి, డిండి, చింతపల్లి, దేవరకొండ మండలాల పరిధిలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కూడా కుంటలు నిండిన పరిస్థితి లేదు.
‘నకిరేకల్’లో..
నకిరేకల్ : నకిరేకల్ , కేతేపల్లి, శాలిగౌరారం, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో ముసురుతో కూడిన వర్షం కురిసింది. నల్ల రేగడి భూములలో వేసి పత్తి చేన్లకు నీరు వచ్చి చేరింది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురుతో వర్షం కురుస్తోంది. కట్టంగూర్, శాలిగౌరారం మండలంలో కూడా భారీ వర్షం కురిసింది. నకిరేకల్ పట్టణంలో సుందరయ్యనగర్‌లో వివిధ కాలనీలు జలమయ్యాయి.
636 అడుగులకు చేరిన ‘మూసీ’ నీటిమట్ట
మూసీప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 ఆడుగులు కాగా, ప్రస్తుతం 636 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఎగువన నుంచి 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శాలిగౌరారం ప్రాజెక్టు కింద 50 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment