సిటీని వణికించిన చినుకు దాడి
* హైదరాబాద్ అతలాకుతలం
* ఏప్రిల్‌లో రికార్డు వర్షపాతం
* నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
* విద్యుత్ సరఫరా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
* గ్లోబల్ వార్మింగ్, అల్పపీడన ద్రోణి ప్రభావం
* 6.1 సెంటీమీటర్లు: నగరంలో 78 ఏళ్ల తరువాత ఏప్రిల్ నెలలో ఒకరోజు వర్షపాతం
* 6.07 సెంటీమీటర్లు: 1937, ఏప్రిల్ 20న వర్షపాతం
హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గత 36 గంటల్లో 8.1 సెంటీమీటర్ల మేర భారీ వర్షం పడింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల్లోనే 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 78 ఏళ్లలో వేసవిలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, అరేబియా, బంగాళాఖాతం నుంచి వీస్తున్న బలమైన తేమగాలులు, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ర్టం మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులుగా నగరంలో వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా కుండపోత కురిసింది.
ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతున వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయి, విద్యుత్ తీగలు తెగిపడి గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలను అప్రమత్తం చేసినప్పటికీ రాత్రివేళ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. కాగా, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట్)లోకి స్వల్పంగా వరద నీరు చేరింది.