- జిల్లాలో 5.2 సెం.మీ వర్షపాతం నమోదు
- షాద్‌నగర్‌లో అత్యధికంగా 45 మి.మీ
- కాగ్నా ఉరకలు.. దుందుబీ పరుగులు
- రిజర్వాయర్, చెరువు, కుంటలకు జలకళ
‘సాక్షి’ నెట్‌వర్క్: వరుణుడు ఆలస్యంగైనా కరుణించడంతో జిల్లావ్యాప్తం గా ఐదురోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు అలుగుపారగా.. ఇప్పటివరకు చుక్కనీరు చేరని చెరువులు జలకళ సంతరించుకుంది. జిల్లాలో కాగ్నా, దుందుబీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికితోడు పలు ప్రాంతాల్లో లోతట్టుకాలనీల్లోకి వరదనీరు వచ్చిచేరడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షపాతం 5.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా నారాయణపేట పేట మండలంలో 45 మి.మీ. వర్షం నమోదైంది.
షాద్‌నగర్ నియోజవర్గంలోని కొందుర్గు, కొత్తూరు మండలాల్లో భారీవర్షం పడింది. కొందుర్గు మండలం లాలాపేట శివారులోని వాగు పొంగి ఇళ్లలోకి వరద నీరు వ చ్చిచేరింది. లాలాపేట, ఉమ్మెంత్యాల, లచ్చంపేట, తుమ్మలపల్లి, ముట్పూర్, రేగడిచిల్కమర్రి, టేకులపల్లి, ఉత్తరాసిపల్లి, బైరంపల్లి, మహదేవ్‌పూర్ తదితర గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గుర్రంపల్లి ఊరచెరువు అలుగుపారుతోంది. రావిర్యాల ఏటిచెరువు, జాకారం తుర్కచెరువులు అలుగుకు దగ్గరలో ఉన్నాయి. కొత్తూరు మండలంలోని మల్లాపూర్ వాగు పొంగిపొర్లుతుంది. చేగూరు, మల్లాపూర్, మామిడిపల్లిలో పంటలు నీట మునిగాయి. మల్లాపూర్ శివారులోని కప్పకుంట చెరువుకు గండిపడటంతో నీరు వృథాగా పోతోంది. షాద్‌నగర్ మండలంలో 4.5సెం.మీ., కొత్తూరులో 2.82 కేశం పేటలో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొడంగల్‌లో ఐదు గంటల పాటు భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్- తాండూరు అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న కాగ్నా బ్రిడ్జిపై వరదనీరు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహించింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న కోట్‌పల్లి డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం పెరిగింది. ధారూర్, అనంతగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం వల్ల కాగ్నా నదికి వరద మరింత ఉధృతమైంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కాశీపురంలో వర్షం నీటి ఉధృతి పెరిగి, గ్రామంలోని వీధుల్లో మూడు అడుగుల ఎత్తు మేర ప్రవహించింది.
- దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల, దేవరకద్ర మండలాల్లో వర్షం పడింది. నారాయణపేట మండలంలో 3 సెం.మీ., కోయిల్‌కొండ, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో ఒక సెంటీమీటర్ లోపు వర్షపాతం నమోదైంది. పేట మండలంలోని సింగారం, పేరపల్లిలో రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
- కొల్లాపూర్ మండలంలోని ఉడుముల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మల్లేశ్వరం, పెంట్లవెల్లి, మొలచింతలపల్లి, ముకిలిగుండం ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో బిజినేపల్లిలో అత్యధికంగా 2.14 సెం.మీ. వర్షం కురవగా తాడూరులో 1.58, తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ లోపు వర్షంకురిసింది.
- మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్, ఆత్మకూర్‌లోని కుమ్మరివీధి, అమరచింతలో మూడు మట్టిమిద్దెలు కూలిపోయాయి. సంగంబండ కాలువ నీరు దిగువకు చేరడంతో పత్తిపంట నీట మునిగింది.
- గద్వాల నియోజకవర్గంలోని ధరూరు మండలంలో భారీ వర్షాల వల్ల నెట్టెంపాడు ప్రధాన కాలువ నీటిని చెరువులకు మళ్లించడంతో మన్నాపురం, సోంపురం, పారుచర్ల, పెద్దపాడు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.
- జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో కురుస్తున్న వర్షానికి దుందుబీ వాగు ఉప్పొంగింది.
భారీ వర్షం
Published Mon, Sep 1 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
Advertisement