
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడా న్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) జారీ చేసిన నోటిఫికేషన్‌ను తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ ఎమన్సిపేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది అవినాశ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని తాము కోరడం లేదన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. శాసనసభ రద్దు నేపథ్యంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, ఈ నేపథ్యంలోనే అభ్యంతరాల గడువును కుదించిందని వెల్లడించింది. సీఈవో నోటిఫికేషన్‌ను తప్పుపట్టలేమని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది.