క్షణికావేశంలో నేరాలు
* అలాంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించాలి
* హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను
సాక్షి, హైదరాబాద్: కొందరు క్షణికావేశంలో మొదటిసారి నేరాలకు పాల్పడుతున్నారని, ఈ కేసులను గుర్తించి రాజీతో పరిష్కరించాలని హైకోర్టు సీని యర్ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను సూచించారు. డిసెంబర్ 6న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో బుధవారం పోలీసు ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాను ప్రసంగించారు.
తరచుగా నేరాలకు పాల్పడుతున్న, కరడుగట్టిన నేరస్తుల కేసులను లోక్‌అదాలత్‌లలో పరిష్కరించాల్సిన అవసరం లేదన్నారు. తెలిసో తెలియకో మొదటిసారి నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలని, ఈ కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించడం ద్వారా వారు మరోసారి నేరాలకు పాల్పడే అవకాశం ఉండదన్నారు. మన దేశంలో జనాభాకు అనుగుణంగా కోర్టుల సంఖ్య లేదని, దీంతో కోర్టులపై కేసుల భారం అధికమవుతోందన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ సహా దర్యాప్తు దశలో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించవచ్చని లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు.
అనంతరం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజని మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాలతో ఎక్సైజ్ కేసులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, మెమో రూపంలో సెక్షన్‌ను మార్చడంతో ఈ కేసులను రాజీ ద్వారా పరిష్కరించవచ్చన్నారు. న్యాయమూర్తులు, అన్ని ప్రభుత్వ విభాగాల అధికారుల సహకారంతో లోక్‌అదాలత్‌లో కేసులను పరి ష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ మహేం దర్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీ చారుసిన్హా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండారెడ్డి, అదనపు సీపీ స్వాతిలక్రా, న్యాయమూర్తులు లక్ష్మీపతి, రాజ్‌కుమార్, రాధాకృష్ణ కృపాసాగర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.