గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్‌ వైఫై | High speed WiFi in rural railway stations | Sakshi
Sakshi News home page

గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్‌ వైఫై

Published Tue, Apr 3 2018 3:34 AM | Last Updated on Tue, Apr 3 2018 9:18 AM

High speed WiFi in rural railway stations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్‌ వైఫై వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఏ1, ఏ, బీ తరహా పెద్ద రైల్వేస్టేషన్లలో ఇప్పటికే గూగుల్‌ సహాయంతో హైస్పీడ్‌ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే 45 గ్రామీణ స్టేషన్లలో హైస్పీడ్‌ వైఫై వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది. సాధారణంగా ఇలాంటి వైఫైలను తొలి అరగంటో, గంటనో ఉచితంగా అందజేసి.. తర్వాత చార్జీ వసూలు చేసే పద్ధతి అమల్లో ఉంది. కానీ గ్రామీణ స్టేషన్లలో రైల్‌టెల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైఫైని మాత్రం పూర్తి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకోసారి లాగిన్‌ అవుతూ వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. 

డిజిటల్‌ ఇండియాలో భాగంగా.. 
ప్రధాని మోదీ డిజిటల్‌ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను అందులో భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) పేరుతే ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. దాని కింద ఉచిత వైఫైని అందుబాటులోకి తేవాలని.. తొలుత ఏ1, ఏ, బీ కేటగిరీ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 స్టేషన్లుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతిలలో.. ఏ కేటగిరీలో 31 స్టేషన్లలో గూగుల్‌ సంస్థ సహాయంతో ఉచిత వైఫై ఏర్పాటు చేశారు. ఇక బీ కేటగిరీలో 38 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతానికి కామారెడ్డి, నిడదవోలు స్టేషన్లలో ఏర్పాటు చేశారు.

ఏడాది చివరినాటికి మిగతా చోట్ల కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రామీణ స్టేషన్లపై దృష్టి సారించారు. రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఇందుకు అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. సాంకేతిక ఏర్పాట్లు పూర్తయిన కొద్దీ ఆయా స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏడు డీ కేటగిరీ స్టేషన్లు, 35 ఈ కేటగిరీ స్టేషన్లు, మూడు ఎఫ్‌ కేటగిరీ స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. ఇందులో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో 2, హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో 19, విజయవాడ డివిజన్‌ పరిధిలో 20, గుంటూరు డివిజన్‌ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement