ఓఆర్‌ఆర్‌ అండర్‌ ‘కంట్రోల్‌’ | HMDA Management on ORR Safety | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ అండర్‌ ‘కంట్రోల్‌’

Published Mon, Mar 11 2019 6:37 AM | Last Updated on Tue, Mar 19 2019 12:13 PM

HMDA Management on ORR Safety - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:   ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై మీరు వెళ్తున్న మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే హెచ్‌ఎండీఏ, పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వాలనుకుంటే ఒక్కో సమయంలో సెల్‌ సిగ్నల్‌ రాదు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రతి కిలోమీటర్‌కు ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. 

మీరు ప్రయాణిస్తున్న రహదారిని మొత్తం పొగమంచు కప్పేస్తే.. ఆ సమయంలో మీ వాహన లైట్లు, ఇండికేటర్స్‌ వేసుకొని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. వాహన చోదకులను జాగృతం చేసే ఇలాంటి అంశాలు ఆ మార్గంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై ప్రొజెక్ట్‌ అవుతుంటాయి.  
సుదూర ప్రాంతం నుంచి సిటీకి వస్తున్న సమయంలో చాలామంది డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజాల వద్ద డ్రైవర్ల ముఖాలపై వాటర్‌ స్ప్రే చేసే పద్ధతిని పరిచయం చేయనున్నారు.  
ఇలాంటి మరెన్నో ఆధునిక ఆలోచనలతో ఓఆర్‌ఆర్‌పై జర్నీ సాఫీగా సాగేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చర్యలు తీసుకుంటోంది. ఇందుకు నానక్‌రామ్‌గూడలో నిర్మిస్తున్న ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా ఓఆర్‌ఆర్‌పై జరిగే ప్రతి కదలికను క్షుణ్ణంగా పరిశీలించనుంది. వాహన చోదకుల భద్రతే ముఖ్యంగా హెచ్‌ఎండీఏ ముందుకెళ్తోంది. హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (హెచ్‌టీఎంఎస్‌)లో భాగంగా ఈ ఏడాది మే నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. గతేడాది జూన్‌లోనే ఆరంభం కావల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. 

స్క్రీన్‌ సైన్‌ బోర్డులు...  
156.9 కిలోమీటర్లున్న ఓఆర్‌ఆర్‌లో దాదాపు 40కి పైగా విభిన్న ఆకృతుల్లో స్క్రీన్‌ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెటాలాజికల్‌ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మందగించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు... ఇలా ఆయా సందర్భాల్లో వాహన చోదకులను అప్రమత్తం చేసేందుకు స్క్రీన్‌ సైన్‌ బోర్డులపై సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తారు. ఉదాహరణకు భారీ వర్షం కురిసినప్పుడు... ‘శంషాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం మంచిది. వాహనాల లైట్లు ఆన్‌ చేసుకొని ముందుకెళ్లండి’ అనే సమాచారాన్ని ముందు ప్రాంతంలోని స్క్రీన్‌ సైన్‌ బోర్డులో డిస్‌ప్లే చేసి వాహన చోదకులను అప్రమత్తం చేస్తారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌ క్లియర్‌గా ఉండడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. 

అనుక్షణం అప్రమత్తం...  
నానక్‌రామ్‌గూడలో అందుబాటులోకి రానున్న ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా ఓఆర్‌ఆర్‌లో జరిగే ప్రతి దృశ్యాన్ని పర్యవేక్షించనున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించిన ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద దాదాపు 50కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక వాహనం రామ్‌ దాటి మరొక వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదాలు జరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో గొడవలు కూడా జరుగుతుండటంతో ఈ ప్రాంతాల్లో నిఘా నేత్రాలను అమరుస్తున్నారు. అలాగే టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తున్న టోల్‌ ప్లాజాల వద్ద కొన్ని వాహనాలకు టోల్‌ వసూలు చేసి, మరికొన్ని వాహనాలను డబ్బులు తీసుకొకుండానే వదిలేయడం జరుగుతోంది. కొంతమంది వాహనదారుల వద్ద గంపగుత్తగా నెల రోజుల్లో ఒక్కసారి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు టోల్‌ ప్లాజాల వద్ద 180 సీసీ టీవీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.  

నిరంతర సేవలు...
నానక్‌రామ్‌గూడలో ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌లోని సిబ్బంది 7/24 అందుబాటులో ఉంటారు. ఓఆర్‌ఆర్‌ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటారు. కిలోమీటర్‌కు చొప్పున ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ కాల్స్‌ బాక్స్‌ ద్వారా వచ్చే కాల్స్‌ను రిసీవ్‌ చేసుకొని వారికి త్వరితగతిన సహాయం అందేలా చూస్తారు. రోడ్డు ప్రమాదాలైతే వెంటనే అక్కడికి అంబులెన్స్‌ను పంపిస్తారు. ట్రాఫిక్‌ జామ్‌ అయితే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించి క్లియర్‌ అయ్యేలా చూస్తారు. ఆ సమాచారాన్ని స్క్రీన్‌ సైన్‌బోర్డులో డిస్‌ప్లే చేసి మిగతా వాహన చోదకులను అప్రమత్తం చేస్తారు.  

వాటర్‌ స్ప్రే...
చాలా వరకు రోడ్డు ప్రమాదాలు డ్రైవర్లు అతివేగంతో వెళ్లే సమయాల్లో, కునుకు తీసిన సందర్భాల్లో జరుగుతున్నాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తు రాకుండా ఉండేందుకు టోల్‌బూత్‌ల వద్ద సిబ్బంది డ్రైవర్ల ముఖాలపై వాటర్‌ స్ప్రే చేయనున్నారు. ఇలా చేయడం వల్ల డ్రైవర్ల నిద్రమత్తు వదిలి ఓఆర్‌ఆర్‌ మార్గంలో వెళ్లిన సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అలాగే వాహనచోదకుల కోసం రెస్ట్‌రూమ్స్, టాయ్‌లెట్స్, డ్రింకింగ్‌ వాటర్‌ను కల్పించేందుకు పెద్ద అంబర్‌పేటలో ప్రయోగాత్మకంగా ‘వే సైడ్‌ ఎమినిటీస్‌’ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు హెచ్‌ఎం డీఏ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత దీన్ని పది ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

ఎల్‌ఈడీ వెలుగులు...
రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమని భావిస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులు... తొలివిడతగా  24.2 కిలోమీటర్ల మేర గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. ఓఆర్‌ఆర్‌తో పాటు సర్వీసెస్, ఇంటర్‌ సర్వీసెస్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. వాహన చోదకుల భద్రతలో భాగంగా మెయిన్‌ క్యారేజ్‌వేలో 1,858 బల్బులు, రామ్స్‌ వద్ద 180 బల్బులు, సర్వీసెస్‌ రోడ్డులో 2,312 బల్బులు, హేవై ఇంటర్‌ఛేంజ్‌ల్లో 178 బల్బులు, వెహికల్‌ అండర్‌ పాస్, పాదచారుల కోసం 228 ట్యూబ్‌లైట్లను హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసింది.  

భద్రతకు చర్యలు...  
హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (హెచ్‌టీఎంఎస్‌)తో వాహన చోదకుల భద్రత కోసం సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఓఆర్‌ఆర్‌పై అందరూ సాఫీగా ప్రయాణం చేసేలా విదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా స్క్రీన్‌  సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నాం. కిలోమీటర్‌కు ఒకటి చొప్పున ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నాం. టోల్‌ప్లాజా, ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్‌ కమాండ్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తాం. హెచ్‌టీఎంఎస్‌ సేవలు మే నుంచి అందుబాటులోకి వస్తాయి.     – ఇమామ్, ఓఆర్‌ఆర్‌ సీజీఎం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement