ప్రతిపక్షాల నజర్
ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు
మెజారిటీ లేకపోయినా పీఠం కోసం ప్రయత్నాలు
హైదరాబాద్‌లో రహస్య సమావేశం
టీఆర్‌ఎస్ తరఫున తెరపైకి టీఎన్‌జీవో నేత దేవిప్రసాద్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మూడేళ్లుగా ఖాళీగా ఉంటున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ప్రతిపక్ష పార్టీలు కూడా కన్నేశాయి. స్థానిక సంస్థల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఏ ఒక్క పార్టీకి సొంతంగా గానీ, అన్ని పార్టీలు ఏకమై బరిలోకి దిగినా ఈ పీఠాన్ని గెలుచుకునేందుకు సరి పడా మెజారిటీ లేదు. అయినా.. ఈ స్థానం కోసం ప్రతిపక్ష పార్టీల నే తలు ఒకరిద్దరు తెరవెనుక పావులు కదుపుతున్నా రు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు, అధికార పార్టీ సభ్యులకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చి గట్టెక్కేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ మేరకు మూడు ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్‌కు చెందిన ప్రేంసాగర్‌రావు ఇలాగే ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అప్పట్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కన్నా టీడీపీకి సుమారు 160 మంది సభ్యుల మెజారిటీ ఉండేది. అయినా కొందరు టీడీపీ సభ్యుల సహకారంతో కాంగ్రెస్ నుంచి ప్రేంసాగర్‌రావు గట్టెక్కారు.
ఈసారీ అలాంటి ఎత్తుగడలు వేసేందుకు టీఆర్‌ఎస్‌యేతర పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగనుంది. చివరిసారిగా జిల్లాలోని స్థానిక సంస్థలకు 2007లో ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ప్రేంసాగర్‌రావుకు లాటరీలో ఆరేళ్ల పదవీ కాలం లభించింది. 2013తో ఆయన పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంటోంది.
తెరపైకి దేవిప్రసాద్ పేరు..
అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొత్తగా టీఎన్‌జీవో నేత దేవిప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఆయనకు ఇచ్చిన హామీ మేరకు దేవిప్రసాద్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్‌కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత శ్రీహరిరావు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.
సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ పేరు కూడా అధినేత పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు అవకాశాలు పూర్తిస్థాయిలో ఉన్న జిల్లా నుంచి టీఎన్‌జీవో నేత దేవిప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌కు అత్యధిక బలం..
వరుస ఎన్నికల్లో జిల్లాలో విజయ ఢంకా మోగించిన టీఆర్‌ఎస్ స్థానిక సంస్థలపై గులాబీ జెండాను ఎగురవేసింది. జిల్లా పరిషత్‌తోపాటు, భైంసా మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది.
అలాగే 52 మండలాల్లో 42కు పైగా మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో అసలు ప్రతిపక్ష పార్టీల ఉనికే లేకుండా పోయింది. పూర్తి మెజారిటీ ఉన్న టీఆర్‌ఎస్‌కు విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేసింది. ఈ స్థానిక సంస్థల జిల్లా ప్రజాప్రతినిధుల ఓటరు జాబితాను రెండు నెలల క్రితమే ఎన్నికల సంఘానికి పంపారు.