రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది?
- నోట్ల రద్దు పరిణామాలపై ఆరా తీసిన ప్రధాని
- ఇబ్బందులు తొలగించే చర్యలు చేపట్టాలని కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోలీసు అకాడమీలో సదస్సు అనంతరం నేరుగా విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని.. నోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణామాలపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందని ప్రధాని అడిగినట్లు సమాచారం. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిసింది. అరుుతే దేశంలో నల్లధనం నిర్మూలన కోసం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలివ్వాలని... అదే క్రమంలో సామాన్యులు, రైతులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారు ఇబ్బంది పడవద్దన్నది తమ ఉద్దేశమని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు.
రాష్ట్రంలో చిల్లర నోట్ల సమస్య తీవ్రంగా ఉందని, కొత్త రూ.500 నోట్లు కూడా పెద్ద మొత్తంలో సరఫరా చేయాలని చెప్పారు. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వర్తకులు ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాన్ని రూపొందించి అమలు చేయాలని అభ్యర్థించారు. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థారుులో ప్రక్షాళన చేసేందుకు దోహదపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోదీకి వెండి వీణను, తెలంగాణ ప్రాశస్త్యాన్ని తెలిపే పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం మోదీ 7.10 గంటల సమయంలో వాయుసేన విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.