రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్ల నిర్వహణ కోసం మంజూరు చేస్తున్న నిధులను ప్రభుత్వం భారీగా పెంచింది.
నిర్వహణ కోసం సిటీ పీఎస్‌లకు నెలకు రూ. 75 వేలు
పట్టణ ప్రాంతాల్లో రూ. 50 వేలు, గ్రామీణ పీఎస్‌లకు రూ. 25 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్ల నిర్వహణ కోసం మంజూరు చేస్తున్న నిధులను ప్రభుత్వం భారీగా పెంచింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నెలకు రూ. 75 వేలు, పట్టణ ప్రాంతాల్లోని పీఎస్‌లకు రూ. 50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని పీఎస్‌లకు రూ. 25 వేల చొప్పున మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్ల నిర్వహణ కోసం ప్రత్యేకించి నిధులు లేకపోవడంతో పీఎస్‌ల స్థాయిలో అవినీతి పెరిగిపోయిందని.. ఏదైనా కేసు దర్యాప్తు కోసం, నిందితుల కోసం వివిధ ప్రాంతాల్లో తిరగడానికయ్యే ఖర్చులను బాధితుల నుంచి పోలీసులు వసూలు చేసేవారని ఆరోపణలున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసుశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు... పీఎస్‌లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
ఇకపై పీఎస్‌లలో ఎవరు డబ్బు అడిగినా తమకు ఫిర్యాదు చేయొచ్చని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా.. పోలీస్‌స్టేషన్ల నిర్వహణకోసం మంజూరైన నిధులను ఏవిధంగా వ్యయం చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా స్టేషనరీ, కేసుల దర్యాప్తు, నిందితుల గాలింపు, అదుపులో ఉన్న నిందితులకు భోజన వ్యయం తదితర అంశాల్లో దేనికెంత వ్యయం చేయాలి? ఇందుకోసం డబ్బును ఇచ్చే అధికారం ఎవరికి ఉండాలి? వ్యయం చేసిన సొమ్ముకు సంబంధించిన వివరాలను ఏవిధంగా నమోదు చేయాలి?.. తదితర నిబంధనలను ఉన్నతాధికారులు రూపొందిస్తున్నారు. వారం రోజుల్లో విధి విధానాల రూపకల్పన పూర్తిచేసి, అమల్లోకి తెచ్చే అవకాశముంది. అంతేగాక పోలీస్‌స్టేషన్లలో ఎవరూ డబ్బు ఇవ్వవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.