అత్తగారింటి ఎదుట ధర్నా చేస్తున్న అమీనా, బంధువులు
వరంగల్: భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకొని ఓ ప్రబుద్ధుడు దుబాయ్ వెళ్లడంతో అతడి ఇంటి ఎదుట మొదటి భార్య న్యాయం కావాలంటూ ధర్నా చేపట్టిన సంఘటన వరంగల్ ఎల్‌బీనగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ కాకాజీకాలనీకి చెందిన అమీనా అనే యువతికి వరంగల్ ఎల్‌బీనగర్‌కు చెందిన నజీంతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో అమీనా తండ్రి జహీర్‌ఖాన్ సుమారు రూ.10లక్షల వరకు కట్న కానుకలు అల్లుడు నజీంకు ముట్టజెప్పారు. పెళ్లయిన తర్వాత అమీనాను దుబాయ్‌కు తీసుకుపోయిన నజీం అదనపు కట్నం కావాలంటూ తరచూ వేధించేవాడు. అమీనా తల్లిదండ్రులు ఫోన్ చేసిన ప్రతీసారి తాను వ్యాపారం చేసేందుకు రూ.10 లక్షలు కట్నం, 20 లక్షలు ఇన్‌వెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసేవాడు. చివరకు కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు తీసుకొచ్చి అమీనాను తల్లిగారింట్లో వదిలేశాడు.
దుబాయ్‌కి వెళ్లిన నజీద్ ఫోన్ చేసిన ప్రతిసారి అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకుపోతానని అనేవాడు. నజీద్ తల్లి దండ్రులు సైతం కట్నం వేధింపులకు గురిచేసే వారు. ఇటీవల తనకు రెండో పెళ్లి అయినట్లు నజీద్ అమీనాకు వాట్సాప్ పోస్ట్ చేశాడు. ఈ విషయంపై నజీద్ అమ్మానాన్నలను ప్రశ్నించగా అవును .. నా కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఏం చేస్తావో చేసుకో పో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో అమీనా కుటుంబ సభ్యులు శనివారం నజీం ఇంటి ఎదుట టెంట్ వేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు.
వీరికి మహిళా సంఘాలు, ముస్లిం మహిళలు సంఘీభావం వ్యక్తం చేయడమే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నజీంను దుబాయ్ నుంచి రప్పించి అమీనాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నజీంకు రెండో పెళ్లి చేసిన అమీనా అత్తమామలను అరెస్టు చేసి న్యాయం చేయాలని మైనార్టీ మహిళా నాయకురాలు రహిమున్నీసా పోలీసుల ను కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అమీనా మామ అజహర్‌పై దాడికి ప్రయత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి గొడవలు కాకుండా భద్రత ఏర్పాటు చేశారు. బాధితురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయనందున కేసు ఫైల్ కాలేదని ఇంతేజార్‌గంజ్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment