చార్మినార్: పాతబస్తీలో లాక్‌డౌన్ ప్రభావం కనిపించడం లేదు. రోడ్లపై గుంపులు గుంపులుగా ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఏదో కారణంతో వీధుల్లో కనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను స్థానిక ప్రజలు సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్‌గా గుర్తించింది. ఇందులో పాతబస్తీ కూడా ఉంది. ఇక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిత్యావసర వస్తువుల పేరుతో వీధుల్లోకి వస్తున్న వారందరిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి పోలీసు అధికారులు హాట్‌స్పాట్ ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. మటన్ షాపులు, చికెన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? రోజుకు ఎన్ని పని చేస్తున్నాయి? అత్యధిక సంఖ్యలో ఏ దుకాణానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది? మార్కెట్లకు రోజుకెంత మంది వస్తున్నారు? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం పాతబస్తీని జల్లెడ పట్టనున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ తర్జనభర్జన పడుతున్నారు. నిత్యావసరాల కోసం రోజంతా కాకుండా ఉదయం, సాయంత్రం ఏదో ఒక సమయాన్ని కేటాయిస్తే.. ఎలా ఉంటుందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రోజుకు ఏదో ఒక సమయంలో రెండు గంటలు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కేటాయిస్తే ఫలితాలుంటాయని ఆలోచిస్తున్నారు.
ఇప్పటికీ 124 మంది గుర్తింపు..
గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లీగ్ జమాత్ సమావేశానికి పాతబస్తీలోని మలక్‌పేట్ సర్కిల్– 6 నుంచి 21 మంది, సంతోష్‌నగర్ సర్కిల్– 7 నుంచి 20, చాంద్రాయణగుట్ట సర్కిల్– 8 నుంచి 25, చార్మినార్ సర్కిల్– 9 నుంచి 21, ఫలక్‌నుమా సర్కిల్–10 నుంచి 37, రాజేంద్రనగర్ సర్కిల్–11 నుంచి నలుగురు వెళ్లి వచ్చారు. మొత్తం పాతబస్తీ నుంచి ఢిల్లీ సభలకు హాజరైన 124 మందిని సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు గుర్తించారు. ఇందులో ఇంకా కొంత మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు అంటున్నారు.
108 వస్తే జనం బెంబేలు..
108 వాహనం ఎక్కడైనా కనిపిస్తే చాలు.. స్థానికుల్లో భయాందోళన మొదలవుతోంది. దూరం నుంచి కూడా ప్రజలు వచ్చి ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది.. కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నాడా.. ఏ ఇంట్లో ఉన్నాడు.. ఎంత మంది ఉన్నారు.. ఢిల్లీకి వెళ్లి వచ్చారా.. విదేశాల నుంచి వచ్చారా? అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇంటికి దూరంగా ఉండాలంటూ వారికి వారే సామాజిక దూరం మెయింటెన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒకే బస్తీలో కలిసిమెలిసి జీవనం చేసిన స్థానికులు.. 108 వచ్చి ఆగి.. ఎవరినైనా వైద్య పరీక్షలకు తీసుకెళ్లే చాలు.. రోజుల తరబడి వారి గురించే ఆలోచనలు, మంతనాలు. ఎవరైనా అనుమానితులుంటే.. తమ బస్తీని పూర్తిగా శానిటైజ్ చేయాలంటూ సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌తో ఇద్దరు పాతబస్తీ నివాసితులు మరణించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. తమ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించాలని కోరుతున్నారు.
యునానీ ఆస్పత్రిలో..
విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిని గుర్తించి గాంధీ ఆస్పత్రితో పాటు ఫీవర్ ఆస్పత్రి, బేగంపేట్ నేచర్ క్యూర్‌లతో పాటు చార్మినార్‌లోని యునానీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. యునానీ ఆస్పత్రిలో కేవలం తబ్లీగ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన 119 మందిని చేర్చి పరిశీలనలో ఉంచారు. వీరందరికి వైద్య పరీక్షలు నిర్వహించి రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. ఇంకొంత మందిని సంబందిత అధికారులు,సిబ్బంది గృహ నిర్బంధం చేశారు. వీరే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి కోవిడ్ వైరస్ ప్రభావం వీరిపై ఉందా.. లేదా అనే వివరాలను సేకరిస్తున్నారు. విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. ఎన్ని రోజులున్నారు.. ఎప్పుడు తిరిగి వచ్చారు.. ఆరోగ్యం పరిస్థితి ఏమిటి.. ఇప్పటి వరకు ఏవైనా వైద్య పరీక్షలు చేయించుకున్నారా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఏమాత్రం వ్యాధి లక్షణాలున్నా.. వెంటనే సంబంధిత ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కనిపించని లాక్‌డౌన్ ప్రభావం..
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ కొంత మంది ఇష్టానుసారంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. వీరిని దక్షిణ మండలం పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ కొంత మంది వినడంలేదు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు కలుగడం లేదు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం లేదు. ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా దుకాణాల వద్దకు చేరుతున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది పాతబస్తీలోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే చార్మినార్, మక్కా మసీదు, గుల్జార్ హౌస్, యునానీ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లోని వీధుల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment