ఉస్మానియా యూనివర్సిటీ మాణికేశ్వర్‌నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (56) అనారోగ్యంతో బాధపడుతుండటంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం బంధువులు సికింద్రాబాద్‌లోనిఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. వెంటిలేటర్‌పై చికిత్సకు రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆస్పత్రియాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒకరోజు వెంటిలేటర్ చికిత్సకు రూ.9500 నిర్ణయించింది కదా! అని ఆమె బంధువులు ఆస్పత్రి వైద్యులను నిలదీయగా.. ప్రభుత్వ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. ఆ ధరలు మాకు గిట్టుబాటు కావు. బిల్లు చెల్లించే స్తోమత ఉంటే.. ఉండండి.. లేదంటే పేషెంట్‌ను తీసుకెళ్లండి’ అని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు రోగి బంధువులు. ఒక్క సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రి మాత్రమే కాదు.. కరోనా చికిత్సలకు ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి. సామాజిక బాధ్యతను విస్మరించడమే కాదు.. ఏకంగా ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఆ ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఆ ధరలకు తాము చికిత్సలు చేయలేమని.. తమ ఆస్పత్రిలో తాము నిర్ణయించిందే ధర అని తెగేసి చెబుతున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజుకు సగటున 150 నుంచి 190 కేసులు నమోదువుతున్నాయి. కోవిడ్ రోగులకు ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్సలు అందించారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య నిపుణులు సహా ఐసీయూ, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకునే సామర్థ్యం ఉన్న ఆస్పత్రులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. నగరంలో 39 కార్పొరేట్ ఆస్పత్రులు అనుమతి పొందాయి. వీటిలో సుమారు పది ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు చికిత్సలు కూడా ఇప్పటికే ప్రారంభించాయి. (ఫీజు కోసం దారుణం: ఆస్పత్రి సీజ్)
ఆదేశాలు బేఖాతర్..
కరోనా వైరస్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను నిలువుదోపిడీ చేసే ప్రమాదం లేకపోలేదని భావించిన ప్రభుత్వం.. చికిత్సలకు ధరలను నిర్ణయించింది. ఆ మేరకు జీఓను కూడా జారీ చేసింది. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.2500 నిర్ణయించింది. ఇంటి నుంచి నమూనాలు సేకరిస్తే అందుకు రూ.2800 చార్జీ నిర్ణయించింది. ఈ ధరలు గిట్టుబాటు కాకపోవడంతో నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా టెస్టులు చేయడం లేదు. ప్రస్తుతం 18 ల్యాబ్‌లు వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందాయి. వీటిలో సీసీఎంబీ, నిమ్స్, ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఐపీఎం, డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్స్ కేంద్రాల్లో మాత్రమే టెస్టులు చేస్తున్నారు. మిగిలిన ప్రై వేటు ఆస్పత్రులు పరీక్షలు చేయడం లేదు. శాంపిల్స్ సేకరించి ఎప్పటిలాగే నిమ్స్‌కు పంపుతున్నాయి. ఇక కోవిడ్ చికిత్సలను కూడా నిరాకరిస్తున్నాయి. ఐసోలేషన్ చికిత్సలకు ప్రభుత్వం రోజుకు రూ.4000, ఐసీయూ చికిత్సలకు రోజుకు రూ.7500, వెంటిలేటర్ చికిత్సలకు రూ.9500 నిర్ణయించింది. పీపీఈ, ఇతర సర్జికల్ కిట్స్, సీటీ, ఎంఆర్‌ఐ లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ కూడా జారీ చేసింది. నగరంలోని పలు కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఈ ఆదేశాలనే బేఖాతర్ చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమకు గిట్టు టు కావంటూ చికిత్సలకు నిరాకరిస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది.
రూ.14 లక్షలు ఖర్చవుతుందన్నారు:రోగి కుమారుడు
మా అమ్మ (56) జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం శనివారం సికింద్రాబాద్‌ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. శ్వాస సరిగా తీసుకోలేక పోతుండటంతో వెంటిలేటర్‌పైకి తరలించారు. ఇప్పటికే రూ.3 లక్షలు చెల్లించాను. కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఖర్చు అవుతుందని, ఆ మేరకు 14 రోజులకు కలిపి రూ.14 లక్షలు చెల్లించేందుకు అంగీకరిస్తేనే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంనిర్ణయించిన ధరలతో తమకు సంబంధం లేదన్నారు. మాది మధ్య తరగతి కుటుంబం. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తాం.?
మంత్రిని కలిశాకే నిర్ణయం ప్రకటిస్తాం
డాక్టర్ భాస్కర్‌రావు, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘంప్రభుత్వం నిర్ణయించిన కరోనా చికిత్సల ధరల్లో స్పష్టత లేదు. ఏ చికిత్సకు ఎంత వసూలు చేయాలనే అంశంలో స్పష్టత లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. గురువారం మధ్యాహ్నం మంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత మా నిర్ణయం ప్రకటిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment