
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కనీవిని ఎరుగని రీతిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఎందుకంటే కరోనా ప్రభావంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లకు మంగళం పాడడంతో రోడ్లపైనే ఉండి కెమెరాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనులపై దృష్టి సారించారు. ఫలితంగా శనివారం ఒక్కరోజే 22,080 ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఈ చలాన్లు జారీ చేశారు. సాధారణ రోజుల్లో అయితే 12,000 నుంచి 13,000 వరకు ఉంటే శనివారం మాత్రం అమాంతంగా ఏడు వేలకుపైగా ఈ చలాన్లు పెరిగి 20,000 దాటి రికార్డును సృష్టించాయి.
రాంగ్‌రూట్ డ్రైవింగ్‌లే అధికం
మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలోని పది ట్రాఫిక్ ఠాణాల్లో రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కెమెరాలు చేతిలో పట్టుకొని విధులు నిర్వహించారు. ఇలా ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కిన ఉల్లంఘనల్లో అత్యధికంగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, వితవుట్ హెల్మెట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ లేకపోవడంతో ఫొటోలు క్లిక్ మనిపించి ఈ చలాన్ వెబ్‌సైట్‌లో ఫొటోతో సహా ఉల్లంఘన ప్రాంతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. సంబంధిత వాహన యజమాని సెల్‌కు సైతం ఎస్‌ఎంఎస్‌లు పంపారు. అయితే ఎక్కడా వాహనాలను ఆపి తనిఖీ చేయక పోవడంతో డ్రైవింగ్ లైసెన్స్ లేని జరిమానాలు నమోదు కాలేదు. అయితే సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం 2,497 ఈ చలాన్లను జారీ చేసిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉల్లంఘనుల్లో 70 శాతం వరకు ద్విచక్ర వాహనదారులే ఉన్నా రని అధికారులు తెలిపారు.