పల్లెబాట పట్టిన మహానగరం | Hyderabadis Left The City For Dussehra Festival | Sakshi
Sakshi News home page

పల్లెబాట పట్టిన మహానగరం

Published Tue, Oct 8 2019 1:52 PM | Last Updated on Wed, Oct 9 2019 8:12 AM

Hyderabadis Left The City For Dussehra Festival - Sakshi

కిటకిటలాడే మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ అండర్‌ పాస్‌ రోడ్డు విజయ దశమి సందర్భంగా ఖాళీగా మారింది

సాక్షి, హైదరాబాద్‌:  విజయదశమి నేపథ్యంలో గ్రేటర్‌ నుంచి భారీగా సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే, ఈ ఏడాది ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌ సమ్మెట పోటులా మారింది. ప్రజా రవాణా సాధనాలైన రైళ్లు, బస్సుల కంటే ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి సొంత వాహనాల్లోనే మెజార్టీ సిటీజన్లు స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాలు, ఏపీలోని పలు నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సుమారు 24 లక్షల మంది బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.

ఎంజీబీఎస్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సులు

ఆర్థికంగా భారమే అయినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో ఈసారి రైళ్లు, బస్సుల కంటే వ్యక్తిగత వాహనాలనే లక్షలాది మంది ఆశ్రయించారు. ద్విచక్ర వాహనాల్లో సుమారు ఏడు లక్షలు.. కార్లు, జీపుల్లో మరో మూడు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకున్నట్లు అంచనా. అంటే వ్యక్తిగత వాహనాల్లోనే ఏకంగా 10 లక్షల మంది సిటీ దాటినట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల క్యూ..


 సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తగ్గిన ప్రయాణికులు

గ్రేటర్‌ సిటీకి ఆవల ఉన్న తూప్రాన్, షాద్‌నగర్, పంతంగి, బీబీనగర్‌ టోల్‌గేట్ల వద్ద వారం రోజులుగా నిత్యం వేలాది వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు సాధారణ టిక్కెట్లపై వందశాతం రెట్టింపు చార్జీలతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేశారు. ప్రయాణం అనేక వ్యయ ప్రయాసలతో కూడినదైనప్పటికీ 100–150 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న ప్రాంతాలకు ద్విచక్రవాహనాలపై లక్షలాది మంది బయలుదేరి వెళ్లారు. తమ గమ్యస్థానాలు 200 కి.మీ పైగా ఉన్నవారు ప్రైవేటు బస్సులు, కార్లు, జీపులతో పాటు రైళ్లను ఆశ్రయించారు.

జేబీఎస్‌లో కనిపించని ప్రయాణికుల సందడి

మొత్తం దసరా పండగ జర్నీ గ్రేటర్‌ సిటీజన్లకు ఆనందం లేకుండా చేసింది. ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా మారడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు పండగ రోజుల్లోనే సమ్మెకు దిగడంతో అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు పండగ ఖర్చులకు అదనంగా ప్రయాణ ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. తెలంగాణా జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ, దసరా నవరాత్రులకు పల్లెబాట పట్టిన సిటీజన్లు ప్రయాణం భారమైనా వెనక్కు తగ్గకుండా వ్యక్తిగత వాహనాల్లో  ముందుకు సాగడం ఈసారి దసరా ప్రత్యేకత కావడం విశేషం.  

సమ్మె.. దశమి ప్రభావంతో ఖాళీగా మారిన బషీర్‌బాగ్‌ చౌరస్తా

దసరాకు గ్రేటర్‌ నుంచి గత నాలుగు రోజులుగా పల్లెబాట పట్టినవారు (సుమారుగా).. 

రవాణా  వెళ్లినవారు
ద్విచక్రవాహనాలు 7 లక్షలు 
ఆర్టీసీ బస్సులు 3 లక్షలు
ప్రైవేటు బస్సులు 5 లక్షలు
రైళ్లు 6 లక్షలు
కార్లు/జీపులు 3 లక్షలు
మొత్తం 24 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement