నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల రాక కోసం బస్టాండ్‌లలో గంటల తరబడి వేచి చూడకుండా ఉండేందుకు ఐ–టిమ్స్ (ఇంటెలిజెంట్–టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తొలిసారిగా సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం కొద్ది రోజులుగా అమలవుతోంది. ప్రయాణికుల సమయం ఆదాచేయడంతోపాటు, బస్సుల్లో కండక్టర్లపైన భారం పడకుండా ఉండేందుకు ఈ విధానం ఎంతగానో దోహద పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఐ– టిమ్స్, జీపీఎస్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి బస్సుల రాకపోకల సమయంతో పాటు, బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నా యి, ఎన్ని సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి, సమీప బస్‌స్టేషన్‌కు ఎంత సమ యంలో బస్సు చేరుతుందనే వివరాలు ముం దుగానే ప్రయాణికులకు తెలియజేస్తారు. తద్వారా ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సమ యం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
బస్టాండ్లలో కండక్టర్లు
ఐ–టిమ్స్ విధానంలో బస్సుల్లో కండక్టర్లు ఉండరు. బస్టాపుల్లో ఉంటారు. జీపీఎస్ టెక్నాలజీతోనే ఐ–టిమ్స్ మిషన్‌లు పనిచేస్తాయి. బస్టాండ్‌లో బస్సు బయల్దేరిన సమయం నుంచి సీట్ల వివరాల వరకు మొత్తం సమా చారం జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తర్వాతి బస్టాప్‌లో ఉన్నటువంటి కండక్టర్‌కు చేరుతుంది. దీంతో అక్కడ వేచి ఉన్న ప్రయాణికులకు బస్సు వచ్చే సమయాన్ని చెప్పడంతోపాటు, ఖాళీగా ఉన్న సీట్ల వరకు ముందుగానే టికెట్లు జారీ చేస్తారు. ఈ విధంగా బస్సు చేరుకునే చివరి పాయింట్ వరకు ఎన్ని స్టాపులు ఉంటాయో అన్ని స్టాపుల్లోనూ కండక్టర్లు ఉంటారు. ఒక స్టాప్‌లో టికెట్లు ఇవ్వడం పూర్తికాగానే ఐ–టిమ్స్‌లో బిల్లు క్లోజ్ చేస్తారు. బిల్లు క్లోజ్ చేయగానే ఆ సమాచారం తర్వాతి స్టాప్‌లో ఉన్న కండక్టర్‌కు చేరుతుంది. పది రోజుల నుంచి సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం అమలవుతోంది.
సూర్యాపేట డిపో ఎంపిక
రాష్ట్రంలో సూర్యాపేట డిపోను ఎంపిక చేసుకుని ఐ–టిమ్స్ అమలు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి నల్లగొండ వరకు 50 కిలోమీటర్ల లోపు దూరం ఉండటం కూడా అందుకు ప్రధాన కారణం. ఐ–టిమ్స్ పనిచేయాలంటే నెట్‌వర్క్ అంతరాయం కలగకూడదు. ఈ మార్గంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య తలెత్తినా సులువుగా పరిష్కరించుకోవచ్చన్న ఉద్దేశంతో ఆర్టీసీ సూర్యాపేట డిపోను ఎంపిక చేసింది. అయితే ఈ ప్రయోగం ఒక్క సూర్యాపేట డిపోకు మాత్రమే పరిమితం చేయడంతో కండక్టర్ల వాడకం పెరిగింది. గతంలో 17 మంది కండక్లర్లు అవసరమైతే ఇప్పుడు 23 మంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో ఇద్దరు ఆపరేటర్లు. మొత్తం 25 మంది ఐ–టిమ్స్ కింద వివిధ బస్టాప్‌లలో పనిచేస్తున్నారు. అయితే అన్ని డిపోల్లో ఇదే విధానం అమల్లోకి వస్తే అప్పుడు కండక్టర్ల వాడకం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
దూర ప్రాంతాలకు మేలు
ఐ–టిమ్స్ విధానం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మరింత మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ టు భైంసా, భద్రాచలం టు హైదారాబాద్, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులకు ఐ–టిమ్స్ సౌకర్యం ద్వారా సమయం కలిసొస్తుందని వారు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లోనే ప్రవేశపెడతారని చెప్పారు. త్వరలో ఆర్టీసీ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీంతో బస్సుల సమయం, ఇతర వివరాలు అన్నీ మొబైల్‌లో చూసుకునే వీలుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment