- ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ హెచ్చరిక
నాంపల్లి, న్యూస్‌లైన్ : చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసిపై దాడులు జరిగితే ఊరుకోమని, హైదరాబాద్ అగ్నిగుండంలా మారుతుందని నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అన్నారు. ఆదివారం రాత్రి దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మజ్లిస్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలపై దాడులు పెరుగుతాయన్నారు. ఇప్పటికే అక్బరుద్దీన్ ఒవైసిని టార్గెట్‌గా చేసుకుని హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్‌కు ఎలాంటి హాని జరిగినా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మోడీ అధికారంలోకి వస్తే సరిపోదని ఇలాంటి వారు ఎంతోమంది వచ్చిపోయారని ఎద్దేవా చేశారు.
జడ్ ప్లస్ భద్రతను కల్పించాలి
అక్బరుద్దీన్ ఒవైసీకి జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పిం చాలని ఎంఐఎం నేత నార్ల మోహన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి నియోజకవర్గం పోచమ్మ బస్తీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలు వేణుగోపాల్, స్వరూపరాణితో కలిసి ప్రసంగించారు. అక్బరుద్దీన్‌పై దాడి కుట్రను తీవ్రంగా ఖండించారు.
అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లకు ఎలాంటి హాని జరిగినా దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. మోడీ హవా వీస్తున్న సమయంలో ఎంపీగా పోటీ చేశానని, ఈ తుఫాన్‌లో గెలిచే అవకాశం లభించలేదని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద తనకు ఒక లక్షా యాభై వేలు ఓట్లు వచ్చాయని తెలిపారు.
ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసిన తనకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
మజ్లిస్ పార్టీ నాయకునికి బెదిరింపు కాల్
చార్మినార్: తనకు ఆదివారం రాత్రి బెదిరింపు కాల్ వచ్చిందని మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ నావేందర్ హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని ధర్మబాద్ నుంచి శ్రీను అని పేరు చెప్పి ఫోన్ చేశారని, ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు అగంతకులు ఆరు నిమిషాల పాటు అసభ్యకరమైన పదజాలంతో చంపేస్తామంటూ బెదిరించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ అగంతకుల ఫోన్ కాల్‌ను పూర్తిగా రికార్డు చేశానని... దీనిని హుస్సేనీఆలం ఇన్‌స్పెక్టర్‌కు అందజేశానని తెలిపారు.