మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విధి నిర్వహణలో నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని ఎంఈఓలను హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్వీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణతాశాతం తగ్గితే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి, రివిజన్ ప్రారంభించాలని, ఎంఈఓలు ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలని, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు.
ప్రభుత్వం విద్యపై కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉందన్నారు. విద్యార్థులను సొంతపిల్లల్లా చూసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పనితీరు సరిగ్గాలేని ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని, ఇకపై డీఈఓ నుంచి టూర్‌డైరీ తెప్పించుకొని చూస్తానన్నారు. ఏజేసీ, డీఈఓలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారన్నారు. ఇటీవల కొందరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. బాలికల పాఠశాలలను ప్రత్యేకంగా సందర్శించాలని అధికారులను ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు కృషి చేయాలని సూచించారు.
అంతకు ముందు ఏజేసీ రాజారాం, డీఈఓ రాజేష్ ఎంఈఓలతో సమావేశమై నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రేడియో కార్యక్రమాలు, మీనాప్రపంచం, ఎల్‌ఈపిత్రిపుల్ ఆర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్ర బృందం పరిశీలన తర్వాత ఎంఈఓలు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల సామార్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ రవీందర్, సిఎంఓ కృష్ణయ్య, ఐఈడీ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్, అసిస్టెంట్ ఎఎంఓ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణత తగ్గితే ఉపేక్షించం
Published Fri, Dec 5 2014 1:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement