జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోంది. వ్యయప్రయాసలకోర్చి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోంది. వ్యయప్రయాసలకోర్చి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఒకప్పుడు ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లాలోనే ఆ కోర్సులకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటవుతున్నాయి.
జిల్లాలో ప్రస్తుతం ఆరు పీజీ కళాశాలు, ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, ఓ మెడికల్ కళాశాల, 24 డిగ్రీ కళాశాలలు, 10 బీఈడీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా వేలాది మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయితే ఉన్నత విద్యకు సంబంధించి చాలా కోర్సులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేనివారు విద్యకు పుల్‌స్టాప్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాకు పలు ఉన్నత విద్య కోర్సులు వస్తాయని విద్యాభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం ఏర్పాటు దశలో ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు మరిన్ని విద్యాసంస్థలు, కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలుంటాయి. గతేడాది మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం 22 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్య సమీప భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నూతన ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని విద్యాభిమానులు భావిస్తున్నారు.
ఐఐటీ మెయిన్స్ వెలుగులు
జిల్లాకు చెందిన విద్యార్థులు గతంలో ఇంటర్‌తో పాటు ఎంసెట్, ఐఐటీ, ఇంజినీరింగ్ కోర్సులలో నాణ్యమైన శిక్షణ కొరకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో జిల్లాలో పలు విద్యాసంస్థలు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఇక్కడే విద్యనభ్యసిస్తున్నారు.
జిల్లాలో ఏటా 28 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఆరు వేల మంది ఎంసెట్‌కు, 11 వేల మంది ఇంజినీరింగ్ శిక్షణవైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఐఐటీ తదితర కోర్సులు, చాలా మంది డిగ్రీవైపు చూస్తున్నారు. దీంతో పలు కళాశాలలు ఎంసెట్ తదితర కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనూ ఐఐటీ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నవారు ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏకంగా 16 మంది విద్యార్థులు ఐఐటీ మెయిన్స్‌కు అర్హత సాధించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో మరిన్ని శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని విద్యాభిమానులు భావిస్తున్నారు.