
జిల్లాకేంద్రంలోలోని ఆటోస్టాండ్‌లో ఆటోలు
సాక్షి, ఆసిఫాబాద్‌అర్బన్: రోజురోజుకు డీజిల్ రేటు పెరుగుతుండడంతో ఆటోవాలాల జీవనం కష్టతరంగా మారుతోంది. ఆటోనే జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొని జీవిద్దామనుకుంటే..రోజు కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అనునిత్యం డీజిల్ ధర పెరుగుతోంది. గతంలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.75కు చేరుకుంది.
ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆటోవాలాలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే అరకొర డబ్బు డీజిల్‌కే పోతోందని, ప్రస్తుతం ఉన్న చార్జీలకు ఆటోలను నడిపి, నెల వచ్చే సరికి తీసుకున్న ఫైనాన్స్ కట్టలేకపోతున్నామని వాపోతున్నారు. ఆసిఫాబాద్ మండల పరిధిలో సుమారు 500 వరకు ఆటోలు ఉన్నాయి. బస్సులు లేనప్పుడు ప్రయాణికులు ఆటోలపైనే ఆధారపడి ఇంటికి చేరుతున్నారు. అయితే ఆటోలు నడిపే వా రి పరిస్థితి మాత్రం అంతా ఆశాజనకంగా లేదు.
నిర్వహణ ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి..
ఆటోలు నడపడానికి పలు రకాల నిర్వహణ ఖర్చులున్నాయి. అంతంత మాత్రంగా వచ్చే డబ్బుతో ఆటోలకు సర్వీసింగ్ కూడా చేయలేని పరిస్థితి వస్తోందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనికితోడు అమాంతంగా పెరిగిన బీమా ధరలు, ఎఫ్‌సీ కాలం ముగిసిన తరువాత వేసే అపరాధ రుసుం ఆటోడ్రైవర్ల జీవనాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి.
సీఐ చొరవతో ఆటోస్టాండ్
ఆర్టీసీ అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆటో స్టాండ్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆటో యజమానులు ఇబ్బందులు పడడంతో స్థానిక సీఐ మల్లయ్య ను ఆశ్రయించారు. అందుకు వారు ఆర్టీసీ అధికా రులతో మాట్లాడి ఆటోస్టాండ్‌ను యథావిధిగా ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయించారు.
డీజిల్ ధరలు ఇలా...
సంవత్సరం డీజిల్ ధర (రూ.లలో)
2014 56
2015 58
2016 60
2017 70
2018 72
2019 75
ఇవీ డిమాండ్లు..
- ఆటోడ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
- ఆటో ఫైనాన్సర్ల వడ్డీ దోపిడీ అరికట్టాలి.
- ఆటోలకు భారీగా పెరిగిన థర్డ్‌పార్టీ బీమా తగ్గించి, 50శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి
- ఎంవీ, యాక్ట్ సవరణ బిల్లు రద్దు చేయాలి
- యాక్సిడెంటల్ బీమాను రూ.5 లక్షలను, సాధారణ, మరణాలకు అంగవైకల్యానికి వర్తింప చేయాలి.
- మండలకేంద్రాల్లో ఆటోలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించాలి
- ఆటో బీమా ప్రీమియం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లను పేదలైన ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి.
వాయిదాలు కట్టలేకపోతున్నాం
అప్పుచేసి ఆటోలు కొనుగోలు చేశాం. ప్రస్తుతం డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు భారీగా పెరిగాయి. చార్జీలు మాత్రం పెరగడం లేదు. చార్జీలు పెంచుదామంటే ప్రజలు అంగీకరించరు. ప్రభుత్వం చొరవ చూపి డీజిల్ ధరలు అదుపు చేయాలి.
– ఎస్‌కె.సాజీద్, ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment