రాత్రి తొమ్మిది దాటితే...యమగండం!
- నగరంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోతున్న వేలాదిమంది జనం
- రాత్రి తొమ్మిది తర్వాతే ప్రమాదాల సంఖ్య అధికం
- నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రిపోర్టులో వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఏదో ఒకచోట రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఏటికేడు ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా...చర్యలు చేపడుతున్నా ఫలితం శూన్యం. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన 2014 గణాంకాల ప్రకారం నగరంలో 2013 కంటే రోడ్డు ప్రమాదాలు పెరిగాయని స్పష్టమైంది. 2013లో 2439 రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2014లో ఆ సంఖ్య 2908కు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. మొత్తమ్మీద ఏడాదిలో 19.2 శాతం పెరుగుదల నమోదైంది.
చెన్నైలో 9,465 ప్రమాదాలు, ఢిల్లీలో 7,191 ప్రమాదాలు, బెంగళూరులో 5215 ప్రమాదాలు, భోపాల్‌లో 4,807 ప్రమాదాలు, కోల్‌కతాలో 4789 ప్రమాదాలు, నాసిక్‌లో 3367 ప్రమాదాలు, జైపూర్‌లో 3,085 ప్రమాదాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర నగరాలతో పొల్చుకుంటే హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా... 2013 కంటే సంఖ్య పెరగడం ఆందోళనకర అంశం. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 361 మంది పురుషులు, 50 మంది మహిళలు మృత్యువాతపడ్డారు. 2,561 మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు ప్రకారం నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాతే అధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో వాహనాల నియంత్రణ కొరవడడం...ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని, 2013లో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటల మధ్యలో 634 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని రిపోర్టు వెల్లడించింది.
పాదచారుల క్రాసింగ్ వద్దే ఎక్కువగా...
నగరంలో ఎక్కువగా పాదచారులు రోడ్డు దాటుతున్న సమయాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థల సమీపంలో 26 మంది పురుషులు చనిపోతే, ఒక మహిళ దుర్మరణం చెందింది. నివాస ప్రాంతాలకు సమీపంలో 41 మంది పురుషులు మరణిస్తే, ఎనిమిది మంది యువతులు మృతి చెందారు. ప్రార్థన స్థలాల వద్ద ఏడుగురు పురుషులు దుర్మరణం చెందితే, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సినిమా హాల్‌ల సమీపంలో ఆరుగురు పురుషులు, ఫ్యాక్టరీ, ఠమొదటిపేజీ తరువాయి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇద్దరు పురుషులు మృతి చెందారు. పెడిస్ట్రియల్ క్రాసింగ్ వద్ద అత్యధికంగా 48 మంది మగవాళ్లు చనిపోతే, ఎనిమిది మంది మహిళలు దుర్మరణం చెందారు. ఇతర ప్రాంతాల్లో 231 మంది పురుషులు, 32 మంది మహిళలు అసువులు బాశారు. కాగా, కోల్‌కతాలో అత్యధికంగా 214 మంది, చెన్నైలో 206 మంది, ఢిల్లీలో 137 మంది, ముంబైలో 131 మంది, విశాఖపట్టణంలో 123 మంది, భోపాల్‌లో 82, విజయవాడలో 75 మంది, రాంచీలో 62 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానం తొమ్మిదిలో 56 మందితో హైదరాబాద్ ఉంది.
‘ఢీ’సెంబరే...
నూతన ఏడాదికి స్వాగతం పలికే డిసెంబర్ మాసంలోనే మన సిటీలో అత్యధికంగా 515 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో 235 మంది, జనవరి, మార్చినెలల్లో 233 మంది, జూలైలో 228 మంది, సెప్టెంబర్‌లో 226 మంది, జూన్‌లో 218 మంది, ఏప్రిల్‌లో 215 మంది, నవంబర్‌లో 213, ఆగస్టులో 199, మేలో 198, ఫిబ్రవరిలో 195 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే డిసెంబర్ నెలను పరిశీలిస్తే చెన్నైలో అత్యధికంగా 825 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఢిల్లీలో 601 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 515 రోడ్డు ప్రమాదాలతో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంది.
అదుపు తప్పుతున్న అనుభవం...
రోడ్డు ప్రమాదాలు అనగానే సాధారణంగా బైక్‌లపై రయ్...మంటూ దూసుకెళ్లే యువకులే గుర్తుకొస్తారు. అయితే తాజాగా ఎన్‌సీఆర్‌బీ నివేదికను చూస్తే...మన నగర రహదారులపై 30 నుంచి 45 సంవత్సరాలున్నవారే ఎక్కువగా ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఈ వయసు గల పురుషులు 503 మంది, 93 మంది మహిళలు దుర్మరణం చెందారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సుగలవారు 596, 18 నుంచి 30 ఏళ్ల వయసు గలవారు 554 మంది మృతిచెందారు. 60 సంవత్సరాలు దాటినవారు 253 మంది, 14 ఏళ్లలోపు పిల్లలు 57 మంది ఉన్నారు.
ఫుట్‌పాత్‌లు పడగొట్డడం వల్లే...
మనవాళ్లు రోడ్ల అందాలకే ప్రియార్టీ ఇస్తున్నారు. విస్తరణ సమయంలో ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఉన్న ఫుట్‌పాత్‌లను పడగొడుతున్నారు. పాదచారుల కోసం ఎటువంటి వ్యవస్థ లేదు. కొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నగరంలో కనిపిస్తున్నా వాటిని ఎవరూ ఉపయోగించడం లేదు.పాదచారుల రక్షణ చూడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. రాష్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవింగ్ చేస్తున్న వారు కరెక్ట్‌గానే నడిపినా...ఎక్కడ క్రాస్ చేయాలో తెలియని పాదచారులు అడ్డు రావడంతో ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయి.
- కాంతిమతి కన్నన్, రైట్ టూ వాక్ ఫౌండేషన్
నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ట్రాఫిక్ పోలీసు శాఖ వంతుగా రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్ని ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ చేపడుతున్నాం. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారికి జరిమానాలు విధిస్తున్నాం. ట్రాఫిక్‌పై అవగాహన కలిగించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు వాహనచోదకుల్లో అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటాం.
- జితేందర్, అదనపు సీపీ, హైదరాబాద్ ట్రాఫిక్