ఎగువన వాన వడి..ప్రాజెక్టుల్లో జలసవ్వడి | Increased flood water to the Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

ఎగువన వాన వడి..ప్రాజెక్టుల్లో జలసవ్వడి

Published Thu, Aug 23 2018 1:48 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

Increased flood water to the Nagarjuna Sagar - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి, కృష్ణా నదులు వరదతో పోటెత్తుతున్నాయి. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో జల సవ్వడి పెరుగుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం నాగార్జునసాగర్‌కి వరద పెరిగింది. దీంతో ప్రాజెక్టుల నిల్వలు 219 టీఎంసీలకు చేరింది. మరో 93 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపించనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర జలా శయం నుంచి వదిలిన ప్రవాహం తోడవ్వడంతో రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. బుధవారం ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదలగా, అంతే నీటిని జూరాల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక తుంగభద్ర నుంచి సైతం 85 వేల క్యూసెక్కులు వదలడంతో బుధవారం సాయంత్రం శ్రీశైలం జలాశయంలోకి 2.14 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు తెరిచి, నాగార్జునసాగర్‌కు వరద నీటిని విడుదల చేశారు. 1.87 లక్షల క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌కు 1.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టుల నిల్వ 312 టీఎంసీలకు గానూ 219 టీఎంసీలకు చేరింది. సాగర్‌ నిండాలంటే ఇంకా 93 టీఎంసీలు అవసరం. కృష్ణా నదిలో వరద కనీసం వారు రోజులు కొనసాగే అవకాశాలు ఉండటంతో నాగార్జునసాగర్‌ వారం, పది రోజుల్లో నిండనుంది.

ఈ నేపథ్యంలో ఇదివరకే నిర్ణయించిన మేరకు గురువారం ఉదయం నుంచి సాగర్‌ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నారు. మొత్తంగా 6.25 లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వాలని ఇది వరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆరు తడుల్లో నవంబర్‌ 28 వరకు 98 రోజు లపాటు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. మొత్తంగా 40 టీఎంసీల నీటిని ఆయకట్టు అవసరాలకు వినియోగించనున్నారు.

నేడో, రేపో ఎస్సారెస్పీ ఫుల్‌...
ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పెద్దఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. జలాశయానికి బుధవారం సాయంత్రం 87 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. దీంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. 90.31 టీఎంసీల నిల్వకు గానూ 72 టీఎంసీలకు చేరింది. మరో 18 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువ మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద కొనసాగనుంది. ఈనేపథ్యంలో గురువారం సాయంత్రానికో, శుక్రవారం ఉదయానికో ప్రాజెక్టునిండే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రాజెక్టుల నీటి నిల్వ పెరిగిన నేపథ్యంలో బుధవారం కాకతీయ కాల్వల ద్వారా 5,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement