సాక్షి, సుజాతనగర్: కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతోంది. కొన్ని రోజుల కిందట పక్క దేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ మహమ్మారికి ఇంకా మందు కనుక్కోలేదని, టీకా కూడా లేదని, ముందస్తు జాగ్రత్తలతోనే దీనిని నివారించాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. అయితే, గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతి వందేళ్లకు ఓ మహమ్మారి ఇలా ప్రజల ప్రాణాలకు పెనుముప్పులా పరిణవిుంచాయని తెలుస్తోంది. మూడు పర్యాయాలు వచ్చిన ఆయా రకాల వ్యాధులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యాధుల సరసన కరోనా (కోవిడ్–19) చేరిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వణికించిన ప్లేగు క్షణాల్లో సోకే ప్లేగు వ్యాధిని మానవ వినాశనిగా చెప్పవచ్చు.
నల్లని పెద్ద ఎముకల మూలంగా సోకే డిసీజ్ ఇది. ఈ వ్యాధి 1720 ప్రాంతంలో వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 2,400 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో కనుగొన్న ఈ వ్యాధి 1894లో ఆగ్నేయ చైనాలో భయంకర భూకంపం ప్రబలినప్పుడు ఆహరధాన్యాల రవాణా, పరిసరాల కాలుష్యం, వలసపోయే వారి వల్ల ప్రపంచమంతటా వ్యాపించింది.
1895లో హాంకాంగ్ నుంచి వచ్చినవారితో మనదేశంలోని బొంబాయి (ఇప్పటి ముంబై)తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లేగు ప్రబలింది. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్లపాటు ఈ వ్యాధి వివిధ ప్రాంతాలను పీడించింది. 1898 నుంచి 1908 వరకు అంటే దాదాపు పదేళ్లలో ప్లేగు వ్యాధి వల్ల దేశంలో 5 లక్షల మంది చనిపోయారు. ఈ వ్యాధి బారిన పడి పారిస్ నగరంలోనే సుమారు 50 వేల మంది మృత్యువాత పడినట్లు చెబుతుంటారు.
1820లో కలరా..
ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం తర్వాత కలరా వ్యాధి సోకింది. ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రబలిన ఈ వ్యాధి బారిన పడి లక్షల మంది మృత్యువాత పడ్డారు. కలరా వ్యాధిని అతిసార వ్యాధి అనికూడా పిలుస్తుంటారు. ‘విబ్రియో కలరే’అనే సూక్ష్మ క్రిమి కారణంగా కలరా సోకుతుంది. దేశంలోని కోల్‌కతా నగరంలో తొలిసారి కలరా ప్రబలింది.
అయితే, దేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ 1820లో మాత్రం యూరప్ వరకూ వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు కలరా మూలంగా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా లక్ష మందికి పైగానే చనిపోయారు. బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశాన్ని వణికించిన కలరా గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం.
1920లో స్పానిష్ ఫ్లూ..
కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే 1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. ఈ వైరస్ పేరు చెబితేనే ఇప్పటికీ భయపడతారు. సృష్టిలోనే అతిపెద్ద విషాదం మిగిలి్చన భయంకర వ్యాధిగా స్పానిష్ ఫ్లూ మిగులుతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్‌గా ఇప్పటికీ దీనిని పరిగణిస్తారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా సుమారు కోటి మంది మృతి చెందారు.
ప్రస్తుతం కరోనా..
స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చిన వందేళ్ల తరువాత ప్రస్తుతం మనం ఇప్పుడు వింటున్న కరోనా వైరస్ వచ్చింది. చైనా దేశంలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడి సుమారు 8 వేల మంది మృతి చెందినట్లు అంచనా. దేశంలో కూడా సుమారు 170 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆలయాలు మూసివేశారు. పరీక్షలను వాయిదా వేస్తున్నారు.
వివాహాలను నిలిపివేస్తున్నారు. బహిరంగసభలు, సమావేశాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్నారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం రద్దు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి భక్తులను రానీయడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. కోవిడ్–19కి కచ్చితమైన చికిత్స కానీ, టీకా కానీ లేదు. ప్రపంచం కనీవినీ ఎరుగనీ ఈ ముప్పును ఎదుర్కొవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం తప్ప మరోటి లేదు.
అప్రమత్తంగా ఉండాలి
ఒక మనిషి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఈ వైరస్ పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు, లేదా చెయ్యి అడ్డుపెట్టుకోవడంతో పాటు, తరచూ సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. కోవిడ్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. అయితే, రోగి దగ్గినా, తుమ్మినా తుంపర్లు గాలిలో ఉండి వాటి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, వ్యక్తికి, వక్తికి మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.
-భూక్యా నాగమణి, వైద్యాధికారి, పీహెచ్‌సీ, సుజాతనగర్
Comments
Please login to add a commentAdd a comment