
‘నాకు బతకాలని లేదు.. ’
♦ సూసైడ్ నోట్ రాసి ఇన్ఫోసిస్ ఉద్యోగి బలవన్మరణం
♦ ఘట్‌కేసర్ మండలం సంస్కృతి టౌన్‌షిప్‌లో ఘటన
ఘట్‌కేసర్: ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ కోల్‌కతాకు చెందిన రోషన్‌కుమార్ చౌదరి(23) మండలంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లోని సీ2 బ్లాక్‌లోని 401 నంబర్ ఫ్లాట్‌లో ఈఏడాది ఫిబ్రవరి నుంచి అద్దెకుంటున్నాడు. సమీపంలోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం ఉదయం సదరు బ్లాక్ వద్ద కాపలాదారుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతున్న రోషన్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. రోషన్‌కుమార్ మంగళవారం రాత్రి ఉరివేసుకొని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.‘నాకు బతకాలని లేదు..ఈ జీవితం నాకు వద్దు. నాన్న నన్ను క్షమించు..’ అని రోషన్‌కుమార్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోషన్‌కుమార్ ఆత్మహత్య ఘటనపై అతడి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.