
కేజీ టు పీజీలో 4 నుంచి 12 వరకు గురుకుల విద్య
- గ్రామీణ విద్యార్థులకే ఆ స్కూళ్లలో ప్రవేశాలు
- ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి అంగన్‌వాడీ కేంద్రాలు
- అధికారులతో చర్చిస్తున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- త్వరలో సీఎం సమక్షంలో విద్యావేత్తలు, సంఘాలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కేజీ టు పీజీ విద్యా విధానంలో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకే ఈ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాక 3వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ఈ ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పించాలని యోచిస్తున్నారు.
ఈ స్కూళ్లలో ప్రవేశాలను లాటరీ ద్వారా కల్పించాలా? లేక ప్రవేశ పరీక్ష ద్వారా కల్పించాలా? అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే లాటరీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా ఈ విద్యా విధానంపై అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేజీ టు పీజీ స్కూళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లు ప్రారంభం అయినా కాకపోయినా, ఎవరి మెప్పు కోసమో కాకుండా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఇదివరకు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16లో) ప్రారంభం కాకపోయినా ఆ తరువాత విద్యా సంవత్సరం నుంచి పక్కా ప్రణాళికలతో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేజీ టు పీజీ విద్యా విధానం ఎలా ఉండాలన్న అంశంలోనూ విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
వీరితో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని సమాచారం. ఇక ప్రాథమిక స్థాయిలో ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు ఎలా అన్న కోణంలోనూ ఆలోచనలు జరుపుతున్నారు. ప్రాథమిక విద్యను తెలుగు మీడియంలో ప్రారంభించాలని మొదట్లో భావించారు. అయితే తల్లిదండ్రుల నుంచి ఇంగ్లిషు మీడియం కావాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశంపైనా పరిశీలన జరుపుతున్నారు. ఇక అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తీసుకువచ్చి ప్రీప్రైమరీ సెక్షన్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో ఒక్కో స్కూల్‌ను దాదాపు రూ. 50 కోట్ల చొప్పును వెచ్చించి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని పాఠశాల విద్యా అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుల విధానంలోనూ మార్పులు తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ఉన్న టీచర్లను పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ), ప్రైమరీ (ప్రాథమిక) స్కూళ్లలో సర్దుబాటు చేయడం సాధ్యం అవుతుందా? లేదా? ఎంతమందిని ఆ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చన్న అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మిగతా ఉపాధ్యాయుల్లో అర్హత కలిగిన వారి పోస్టుల పేర్లను మార్పు చేయడం ద్వారా ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఆ తరువాత ఇంకా అవసరమైన పోస్టుల్లో కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.