మోర్తాడ్ : ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ఆసరాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌పుట్ సబ్సిడీని ప్రకటించారు. ఐదేళ్ల కిందట నష్టపోయిన పంటకు ఇప్పుడు పరిహారం అందడం గమనార్హం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే నష్టపోయిన పంటలకు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందించారు.
ఆయన అకాల మరణం తర్వాత ఐదేళ్లు ఆలస్యంగా ఇన్‌పుట్ సబ్సిడీ రైతన్నలకు అందుతోంది. అది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో సాధ్యమైంది. ఇన్‌పుట్ సబ్సిడీతో జిల్లావ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జిల్లాకు చేరనున్నాయి. 90రోజుల కాల వ్యవధిలో పంటలను నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ జమ కానుంది. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదరగాలులతో నష్టపోయిన పంటలకు పరిహారం లభించనుంది.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేసిన అంచనాల ప్రకారం *1.27 కోట్లు మంజూరు అయ్యాయి. భారీ వర్షాలు, ఈదరగాలుల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు *18.79 కోట్లు మంజూరు అయ్యాయి. పంటలు నష్టపోయిన సందర్బంలో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్ట పరిహారం అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేశారు. వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు.
ప్రతి సీజనులో ఏదో ఒక కారణంగా భారీగానే పంటల నష్టం జరిగింది. నష్టం అంచనా వేయడం మినహా ప్రభుత్వం ఎలాంటి పరిహారాన్ని మంజూరు చేయలేదు. వైఎస్ హయాం తర్వాత ఐదేళ్ల నుంచి రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తెలంగాణ సర్కారు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం నిధులను కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు ‘ఇన్‌పుట్ సబ్సిడీ’
Published Wed, Aug 13 2014 3:27 AM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement